ipl-10-2017-mumbai-indians-play-off-iplఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10లో ప్లే ఆఫ్స్ కు అర్హత పొందే నాలుగు జట్లల్లో మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ ప్రవేశించడం ఇక లాంచనమే. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ లో పూణే చేతిలో ఓడిపోయిన ముంబై, ఆ తర్వాత వరుసగా 6 విజయాలను సొంతం చేసుకుని, ‘డబుల్ హ్యాట్రిక్’ను నమోదు చేసుకుంది. దీంతో 12 పాయింట్లతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇంకా చేతిలో మరో 7 మ్యాచ్ లు ఉండగా, మూడింటిలో విజయం సాధిస్తే టాప్ 1గా నిలవడం ఖాయంగా చెప్పవచ్చు.

వరుసగా అయిదు మ్యాచ్ లలో విజయవంతంగా లక్ష్యాలను చేధించడంతో, ముంబైకు తొలుత బ్యాటింగ్ అప్పగించింది ఢిల్లీ. ఈ ఎత్తుగడ ఫలించడంతో కేవలం 142 పరుగులు మాత్రమే నమోదు చేసింది ముంబై. ఓపెనర్ జాస్ బట్లర్ ఇచ్చిన బీభత్సమైన అవకాశాలను మిడిల్ ఆర్డర్ నిలబెట్టుకోలేకపోవడంతో, ఇన్నింగ్స్ కుప్పకూలింది. రానా, రోహిత్ శర్మ, పొల్లార్డ్, కృనాల్, హార్దిక్… ఇలా అందరూ భారీ షాట్లకు ప్రయత్నించి ఢిల్లీ ఫీల్డర్లకు దొరికిపోయారు. దీంతో ఢిల్లీ ఈ మ్యాచ్ లో జయకేతనం ఎగురవేయడం తధ్యమని భావించారు.

స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీకి తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. స్కోర్ బోర్డు 1 పరుగు మీద ఉన్నప్పుడు థారే రనౌట్ కాగా, అదే స్కోర్ బోర్డు 24 పరుగులు చేరుకునే సమయానికి 6 వికెట్లను కోల్పోయింది ఢిల్లీ. ఒకరి వెంట ఒకరు పోటీపడి మరీ పెవిలియన్ కు చేరడంతో, అసలు ఆశలు పెట్టుకోని ముంబై విజయం దాదాపుగా ఖరారైంది. అయితే ఆ తర్వాత రబడ (44), మోరిస్ (52)లు ప్రయత్నించినప్పటికీ, రన్ రేట్ పెరిగిపోయి మ్యాచ్ ఢిల్లీ చేతుల్లో నుండి వెళ్లిపోయింది.

ఊహించని విక్టరీతో ముంబై ఇండియన్స్ జట్టు పండగ వాతావరణంలో మునిగిపోయింది. 200 పరుగుల స్కోర్ నే అవలీలగా చేధిస్తున్న నేపధ్యంలో… కేవలం 143 పరుగులు చేయలేక చతికిలపడం ఢిల్లీకి షాకింగ్ విషయమే. ఈ ఓటమితో 6 మ్యాచ్ లలో 2 గెలుపులతో 4 పాయింట్లు సాధించిన పంజాబ్, బెంగుళూరు, గుజరాత్ జట్ల సరసన నిలిచింది ఢిల్లీ. తొలి నాలుగు స్థానాలలో ముంబై (12 పాయింట్లు), కోల్ కతా (8 పాయింట్లు), హైదరాబాద్ (8 పాయింట్లు), పూణే (6 పాయింట్లు) జట్లు ఉన్నాయి.