Botsa_Satyanarayana_on_Intermediate_Resultsఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థ ఎంత గొప్పగా ఉందో ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలు, ఈరోజు విడుదలైన ఇంటర్ ప్రదమ, ద్వితీయ ఫలితాలు కళ్ళకు కట్టినట్లు చూపుతున్నాయి. పదో తరగతిలో కేవలం 67 శాతం మంది విద్యార్దులు ఉత్తీర్ణులుకాగా, ఇంటర్ ప్రదమ, ద్వితీయ ఫలితాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఇంటర్ ప్రదమలో 54 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులు కాగా, ఇంటర్ ద్వితీయలో 61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ఈ ఏడాది 4,45,604 మంది విద్యార్దులు ఇంటర్ ప్రధమ పరీక్షలు వ్రాయగా వారిలో 2,41,591 మంది పాస్‌ అయ్యారని అదేవిదంగా 4,23,455 మంది ఇంటర్ ద్వితీయ పరీక్షలు వ్రాయగా వారిలో 2,58,449 మంది పాస్ అయ్యారని సాక్షి మీడియా క్లుప్తంగా పేర్కొంది.

దీనినే తిరగేసి చెప్పుకొంటే ఇంటర్ ప్రధమలో 2,04,013 మంది ఫెయిల్ అవగా, ఇంటర్ ద్వితీయ పరీక్షలలో 1,65,006 మంది విద్యార్దులు ఫెయిల్ అయ్యారని అర్ధం అవుతోంది. పరీక్షలు వ్రాస్తున్న విద్యార్దులలో ఇంచుమించు సగానికి సగం మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు?లోపం ఎక్కడుంది? దానిని ఏవిదంగా సరిదిద్దుకోవాలి?అనే ఆలోచన చేయవలసి ఉండగా, ఈ విషయంలో తమ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రతిపక్షాలను ఏవిదంగా తిప్పి కొట్టాలి? ఏవిదంగా వారిపై ఎదురుదాడి చేయాలని మాత్రమే వైసీపీ మంత్రులు ఆలోచిస్తుండటం విద్యావ్యవస్థ దౌర్భాగ్యం అని సరిపెట్టుకోవాలి.

అయితే విద్యార్దులు ఫెయిల్ అయితే అమ్మఒడి, విద్యాదీవెన పధకాల ఆర్ధిక భారం తగ్గుతుంది కనుక ప్రభుత్వం లోలోన సంతోషిస్తుందేమో? నాడు-నేడు పేరుతో స్కూళ్ళు, కాలేజీలకు రంగులు వేసి ఎంత గొప్పగా చూపించినా ఆది పైన పటారం లోన లొటారమే అని ఈ ఫలితాలే నిరూపిస్తున్నాయి కదా?కనుక ఓట్ల కోసం పధకాలపై చూపిస్తున్న శ్రద్దను విద్యావ్యవస్థను బలోపేతం చేయడంపై చూపిస్తే తప్పకుండా ఇంతకంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవి.