India-won-t20తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చతికిల పడుతుందేమోనని అభిమానులను కలవర పెట్టిన టీమిండియా చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు అత్యుత్సాహానికి పోయి ఓటమిని కొని తెచ్చుకున్నారు. ప్రధాన బౌలర్లందరి స్పెల్ ముగియడంతో చివరి ఓవర్ వేసే బాధ్యతను హార్దిక్ పాండ్యకు అప్పగించాడు ధోని.

అప్పటికే క్రీజులో పాతుకుని ఉన్న మొహ్మదుల్లా మొదటి బంతిని ఫేస్ చేయడంతో బంగ్లా విజయనికే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మొదటి బంతి అద్భుతంగా ఆఫ్ సైడ్ యార్కర్ వేయడంతో కేవలం ఒక్క పరుగుకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే స్ట్రైకింగ్ కు వచ్చిన ముషాఫికర్ రహీమ్ రెండు, మూడు బంతులను వరుసగా ఫోర్లు కొట్టి భారత పరాజయాన్ని దాదాపుగా ఖరారు చేసాడు.

ఈ తరుణంలో బంగ్లాకు 3 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే విజయానికి కావాలి. అయితే పాండ్య వేసిన నాలుగవ బంతిని ఫుల్ షాట్ ఆడిన రహీమ్ బౌండరీ లైన్ వద్ద శిఖర్ ధావన్ కు దొరికిపోయాడు. అయినప్పటికీ బంగ్లా విజయానికి 2 బంతుల్లో 2 పరుగులు చేయాల్సి ఉండగా, స్ట్రైకింగ్ కు మొహ్మదుల్లా రావడంతో బంగ్లా విజయం ఖాయం అనుకున్నారంతా. అయితే పాండ్య వేసిన ఫుల్ టాస్ బంతిని గాల్లోకి లేపిన మొహ్మదుల్లాను జడేజా అద్భుతమైన క్యాచ్ తో వెనక్కి పంపాడు.

దీంతో చివరి బంతి చేరుకునే సమయానికి 1 పరుగు టై అయితే సూపర్ ఓవర్ లేదంటే విజయానికి 2 పరుగులు చేయాల్సి ఉంది. ఇక్కడే కెప్టెన్ గా ధోని తన ప్రతిభ ఏమిటో నిరూపించారని చెప్పాలి. టైల్ ఎండర్ బ్యాట్స్ మెన్ కావడంతో బంతి బ్యాట్ కు తగిలినా లేకున్నా పరుగు పెడతారని ఊహించిన ధోని, ముందుగానే తన చేతికి ఉన్న రెండు గ్లౌజులలో ఒకదాన్ని తొలగించాడు. ధోని అంచనా వేసిన విధంగానే పాండ్య వేసిన ఆఫ్ సైడ్ బంతిని బ్యాట్స్ మెన్ ఆడకపోవడంతో బాల్ ధోని చేతికి చిక్కింది.

ఈ సందర్భంగా మరోసారి ధోని సమయస్ఫూర్తి కూడా ఇక్కడ ప్రత్యేకంగా మెచ్చుకుని తీరాలి. తనకు అందిన బంతిని వికెట్ల వైపుకు నేరుగా విసిరితే తగలవచ్చు, తగలకపోవచ్చు… అందుకని అవతలి బ్యాట్స్ మెన్ చేరుకునే లోపు వికెట్ల వైపుకు పరిగెత్తిన ధోని, రనౌట్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేసాడు. థర్డ్ ఎంపైర్ నిర్ణయంతో టీమిండియా ఒక పరుగు తేడాతో విజయం సాధించి టోర్నీలో ఆశలను సజీవంగా నిలుపుకున్నారు. ఇలా చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ వీక్షకులను సీట్లల్లో కూర్చోబెట్టి మాంచి కిక్ ను ఇచ్చింది. ఈ ఓటమితో బంగ్లాదేశ్ టోర్నీ నుండి వైదొలగింది.