IPL 2017 scheduleసమ్మర్లో క్రికెట్ ప్రేమికులకు పండగ లాంటి వినోదాన్ని అందించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న ఈ టోర్నీ ఈ సారి వీక్షకులను ఎంతవరకు రంజింప చేస్తుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. దీనికి ప్రధాన కారణాలు… క్రికెట్ అభిమానుల్లో క్రేజ్ ఏర్పరచుకున్న టీమిండియా క్రికెటర్లు గాయాలబారిన పడి ఈ ఐపీఎల్ నుండి తప్పుకోవడమే! ఇందులో మొదటి పేరుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి లేకపోవడం ఐపీఎల్ కు ప్రధాన ఆకర్షణ పోయినట్లయ్యింది.

తన దూకుడైన స్వభావంతో మ్యాచ్ లను ఆద్యంతం రసవత్తరంగా మార్చేసే విరాట్ కోహ్లి భుజం గాయం కారణంగా ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అయితే కొన్ని మ్యాచ్ ల వరకు అందుబాటులో ఉండడా? లేక టోర్నీ మొత్తం నుండి తప్పుకున్నాడా? అన్నది ఇంకా ఖరారు కాలేదు. కానీ బెంగుళూరు ఆడబోయే తొలి మ్యాచ్ లలో విరాట్ ను వీక్షించలేం. ఒక్క విరాట్ కోహ్లినే కాదు, ఆసీస్ సిరీస్ మొత్తం సూపర్ ఫాంలో ఉన్న రాహుల్ కూడా భుజం గాయం కారణంగా ఐపీఎల్ నుండి పూర్తిగా తప్పుకున్నాడు.

అలాగే మురళీ విజయ్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్ వంటి ఇతర టీమిండియా క్రీడాకారులు తప్పుకోగా, విదేశాలకు చెందిన క్రేజీ ఆటగాళ్ళు కూడా ఇదే రూట్ లో పయనిస్తున్నారు. డివిలియర్స్ కు కూడా గాయం కావడంతో, తొలి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడనే సమాచారం ఆ జట్టును కలవరపెడుతోంది. అలాగే కెవిన్ పీటర్సన్, డీకాక్, డుమినీ, రస్సెల్, బ్రావో, ముస్తాఫిజుర్ వంటి అద్భుతమైన ప్రతిభ కనపరిచే క్రీడాకారులు లేకపోవడంతో ఐపీఎల్ చప్పగా సాగుతుందేమోనన్న అంచనాలు మొదలయ్యాయి. అందరి ఆటగాళ్ళకు ఒకటే బెడద… శృతిమించిన షెడ్యూల్స్ తో గాయాల బారిన పడడం!