indian-banks-receive-3-4-lakhs-crores-narendra-modi-demonetizationదాదాపుగా పది రోజుల క్రితం… సాయంత్రం 8 గంటల సమయంలో… ఒక్కసారిగా టీవీలలో ప్రత్యక్షమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఓ 10 నిముషాల పాటు ప్రసంగించారు. అంతే… ఇక దేశవ్యాప్తంగా ఒక్కటే రచ్చ. అప్పటినుండి ప్రారంభమైన చర్చలు ఇప్పటివరకు కూడా ముగియలేదు. ఎప్పటికి ముగుస్తుందో కూడా దరి, అంతు లేదు. అయితే దీనిపై ప్రముఖ రచయిత సిరాశ్రీ తనదైన శైలిలో అభివర్ణించారు.

“ప్రపంచంలోని అందరి సూపర్ స్టార్లను మించిపోయే విధంగా కేవలం 10 నిముషాల షార్ట్ ఫిల్మ్ తో 5 రోజుల్లోనే 3.40 లక్షల కోట్లు వసూళ్లు చేసి ఆల్ టైం రికార్డును నరేంద్ర మోడీ అందుకున్నారని” తనదైన సినీ పరిభాషలో వ్యక్తపరిచారు. నిజమే… సిరాశ్రీ చెప్పిన గణాంకాలు సరైనవే. అయితే ఆ ఫిగర్ అంతకంతకూ పెరిగి ఇప్పటికే 4 లక్షల కోట్లు దాటాయి. అయితే ప్రధాని టార్గెట్ మాత్రం వేరు. ఇప్పటివరకు సర్క్యులేషన్ లో ఉన్న 500, 1000 నోట్ల మొత్తం విలువ 14 లక్షల కోట్ల పైనే.

అంటే రాబోయే 40 రోజుల్లో మరో 10 లక్షల కోట్లు వచ్చి చేరితే, దేశంలో ఉన్న డబ్బులో ఎక్కువ శాతం వైట్ గా మారిపోయినట్లే. ఇక, ఇక్కడ నుండి తదుపరి చర్యలు ఏంటనేది వచ్చిన వసూళ్ళ బట్టి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రధాని నిర్దేశించుకున్న లక్ష్యం సాధ్యం కాకపోవచ్చని, మహా అయితే ఓ 10 లక్షల కోట్లు బ్యాంకులలో జమయ్యే అవకాశం ఉందని, మిగిలిన 4 లక్షల కోట్లు కూడా చిత్తు కాగితాలు మారిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని వ్యక్తమవుతున్న అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.