indian-army-indian-army-killed-pok-terroristపాకిస్థాన్ స‌రిహ‌ద్దులో ఉన్న భార‌త రాష్ట్రాల ముఖ్య‌మంత్రులంద‌రికీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఫోన్ చేసి, పాక్‌ సరిహద్దులోని ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని ఆదేశించారు. ముఖ్యంగా పంజాబ్‌లో 10 కిలో మీటర్ల మేర ప్రజలను ఖాళీ చేయించాలని పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ కు ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు వద్ద చోటు చేసుకుంటున్న తీవ్ర పరిణామాలపై దేశంలోని అన్ని ప్రముఖ పార్టీల నేతలతో హోంమంత్రి కీలక చర్చలు జరపనున్నారు.

పాక్ అక్రమిత కశ్మీర్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై బుధవారం రాత్రి “సర్జికల్ స్ట్రయిక్స్” చేసినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ చేసిన ప్రకటన చాలా మందిని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. సర్జికల్ స్ట్రయిక్స్ అనేవి నిర్ణీత లక్ష్యాలపై చేసే దాడులు. ఆ లక్ష్యాన్నే బాగా దెబ్బతీసేలా ఉంటాయి తప్ప, మిగిలిన ప్రాంతాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జరిపేటటువంటి దాడులు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రాంతానికి సమీపంలో ఉండే ప్రజలకు, భవనాలు, వాహనాలకు కూడా ఎలాంటి నష్టం జరగదు. ఇటీవల ఆర్మీకి చెందిన 70 మంది కమాండోలు మయన్మార్ లో ఇటువంటి ఆపరేషనే నిర్వహించారు. 40 నిమిషాల్లో ఆపరేషన్ ముగించి 38 మంది నాగా వేర్పాటువాదులను మట్టుబెట్టారు. సర్జికల్ స్ట్రయిక్స్ లో భాగంగా బాంబుల విడుదల కూడా ఉంటుంది.

పాక్ ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్ యుద్ధానికి స‌న్న‌ద్ధమయినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు పాకిస్థాన్ ప్రధాని న‌వాజ్ ష‌రీఫ్ పాక్ భద్రత, రక్షణకు సిద్ధంగా ఉన్నామని, బుధవారం నాడు భారత్ చేసిన దాడిని ఖండిస్తున్నామ‌ని చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇదిలా ఉంటే, ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ప్రకటించిన ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైన పాకిస్థాన్ తీరును తాము గమనిస్తున్నామని, ఉగ్రవాదంపై పోరాడుతున్న భారతదేశానికి సహకరిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు ఫోన్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ఇక, సరిహద్దు ఆవల ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడి గర్వకారణమంటూ కేంద్రమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు సమర్థించారు. దేశం మొత్తం సైన్యం వెనుక నిలబడుతుందని ఆయా ట్వీట్లలో పేర్కొన్నారు. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ పై సునిశిత దాడులు చేసిన భారత్ సైన్యాన్ని చూసి గర్వపడుతున్నానని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తమ ట్వీట్లలో ‘భారత్ మాతాకీ జై.. యావత్తు దేశం సైన్యం వెనుక ఉంది’ అని ట్వీట్లు చేశారు. పాకిస్థాన్ తీవ్రవాదిలా వ్యవహరిస్తోందని జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్, తీవ్రవాదులందరికీ ఇది తగిన గుణపాఠమని బీజేపీ నాయకుడు షహనవాజ్ హుస్సేన్ పేర్కొన్నారు.