indian-army-surgical-strikeపాకిస్థాన్ క్షణానికో ప్రకటన చేస్తుండడంతో ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించిన భారత సేనలు, గత రాత్రి ఆకస్మికంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లారు. మేకపోతు గాంభీర్యంతో బీరాలు పలుకుతున్న పాకిస్థాన్ ను మౌనంగా దెబ్బకొట్టాలని నిర్ణయించింది. దీంతో సరిహద్దుల ఆవల ఏం జరుగుతోందోనని ఓ కన్నేసి ఉంచిన భారత్ నిఘా వర్గాలు… సరిహద్దుల్లోని తీవ్రవాద శిబిరాలను తరలించే క్రమంలో వారందర్నీ ఒక దగ్గరకు చేరినట్టు గుర్తించాయి. ఇదే సమయంలో వారిని భారత్ పైకి ఉసిగొల్పేందుకు ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సన్నాహాలు చేసుకుంటున్నాయన్న సమాచారంతోనే… భారత సైనికులు విరుచుకుపడ్డారు.

కేవలం 48 నిమిషాల సమయంలో శత్రు దేశంలోకి మూడు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి… 38 మంది ముష్కరులను మట్టుబెట్టి, మార్గంలోని ఏడు టెర్రరిస్టు క్యాంపులను నేలమట్టం చేశారు. ఎంత వేగంగా వెళ్లారో అంతే వేగంగా వెనక్కి వచ్చేశారు. ఏం జరుగుతోందని పాక్ తెలుసుకునే లోపు భారత సేనలు ఆపరేషన్ ముగించి స్వదేశం చేరడం విశేషం. దీంతో భారత్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసినట్లయ్యింది. దొడ్డి దారిలో ఎప్పటికప్పుడు దెబ్బతీయడం మీ పని అయితే, మేము కళ్లు తెరిస్తే మీరు తుడిచి పెట్టుకుపోతారన్న బలమైన సందేశం ఇచ్చింది. అదే సమయంలో ప్రపంచ దేశాల (ప్రధానంగా చైనా)కు తమ సహనానికి కూడా హద్దుంటుందన్న సూచనలు పంపింది. దీంతో భారత్ లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, పాక్ లో మాత్రం తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ ‘ఆపరేషన్’ మొత్తం అవును మొత్తం రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కనుసన్నల్లోనే జరిగినట్లుగా తెలుస్తోంది. భారత సైన్యం వేగంగా పాకిస్థాన్ లోపలికి చొచ్చుకుపోవడం… మెరుపుదాడులు నిర్వహించడం… ధీమాగా వెనక్కి రావడం వరకు “సర్జికల్ ఆపరేషన్” సక్సెస్ ఫుల్ గా సాగడం వెనుక మనోహర్ ప్లానింగ్ అద్భుతమని కొనియాడుతున్నారు. టార్గెట్ ల ఎంపిక దగ్గర్నుంచి, వాటిపై దాడులు చేయబోయే విధానం, తిరిగి వెనక్కి వచ్చే ప్లాన్ ఇలా ప్రతీదీ మనోహర్ పారికర్ కు చెప్పే భారత సైన్యం చేసినట్టు తెలిపింది.

భారత త్రివిధ దళాధిపతులతో భేటీ జరిగిన సమయానికే భారత సైన్యం ఏడు ఉగ్రవాద శిబిరాలను ఎంచుకోవడం, అందులోని ఉగ్రవాదులను మట్టుబెట్టడం, వెనుదిరగడం వంటి పూర్తి స్థాయి ప్రణాళికపై మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఫైల్ పారికర్ చేతుల్లో ఉందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనపై స్పందించిన… కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌ నాయుడు… ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలకు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని పాక్‌కు తాము మొద‌ట విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు తెలిపిన వెంకయ్య, అయిన‌ప్ప‌టికీ పాక్ త‌మ బుద్ధిని మార్చుకోలేద‌ని, తాము చెప్పిన మాట‌ల‌ను విన‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భార‌త సైన్యం తీసుకున్న చ‌ర్య‌లు స‌మ‌ర్థ‌నీయ‌మ‌ని, ఉగ్ర‌వాదం ఇండియాకు మాత్ర‌మే కాద‌ని, మొత్తం ప్ర‌పంచానికే ప్ర‌మాద‌మ‌ని వెంక‌య్య అన్నారు.