Indian Army Retaliated to Pakistan Firingపదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ సైనికులను ఇక ఎంతమాత్రమూ ఉపేక్షించరాదని భావిస్తున్న భారత సైన్యం దీటైన సమాధానం ఇస్తోంది. ముఖ్యంగా, ఉరీ ఉగ్ర దాడి, ఆపై సర్జికల్ దాడుల తరువాత గత నెల 19వ తేదీ నుంచి నిత్యమూ ఇరువైపులా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ 11 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతా దళాల సైన్యం ఎంఎంజీ, ఎల్ఎంజీ తదితర రైఫిళ్లతో 35 వేల బులెట్లను పాక్ సైనికులే లక్ష్యంగా పేల్చాయి.

900 మీటర్ల వరకూ లక్ష్యాలను ఛేదించే 2 వేల మోర్టార్ షెల్స్, ఆరు కిలోమీటర్ల వరకూ వెళ్లి పేలగల 3 వేలకు పైగా లాంగ్ రేంజ్ మోర్టార్లను పేల్చాయి. వీటితోనే నాలుగు పాక్ సైనిక పోస్టులను భారత సైన్యం గత వారం నామరూపాలు లేకుండా చేసింది. బీఎస్ఎఫ్ కాల్పుల్లో 15 మంది పాక్ సైనికులు, మరికొందరు పాక్ పౌరులు మరణించినట్టు తెలుస్తుండగా, పాక్ కాల్పుల్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు అమరులయ్యారు.

ఈ 11 రోజుల్లో పాక్ 60 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు సైన్యాధికారి ఒకరు తెలిపారు. ఇక రాత్రి పూటే ఎక్కువగా కాల్పులకు తెగబడుతున్న పాక్, ముష్కరులను సరిహద్దులు దాటించేందుకు యత్నిస్తుండగా, నిత్యమూ అప్రమత్తంగా ఉన్న జవాన్లు చొరబాటు ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు.