India vs West Indies t20 2017జమైకా, సబీనా పార్క్ వేదికగా జరిగిన ఏకైక టీ 20 మ్యాచ్ లో టీమిండియాను వెస్టీండీస్ జట్టు మట్టికరిపించింది. విండీస్ ఓపెనర్ ఎవిన్ లెవీస్ సృష్టించిన బీభత్సానికి భారత బౌలర్లు విలవిలలాడారు. 62 బంతులను ఎదుర్కొన్న లెవీస్ 6 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయమైన 125 పరుగులు చేయడంతో, టీమిండియా సాధించిన 190 పరుగుల భారీ స్కోర్ చిన్నబోయింది. ఈ క్రమంలో ఒకే జట్టుపై రెండు టీ20 సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ గా లెవీస్ సరికొత్త రికార్డును సృష్టించాడు.

11 నెలల క్రితం టీమిండియా పైనే సూపర్ సెంచరీ చేసి నాడు కూడా భారత్ ఓటమికి కారణమైన లెవీస్, మరో మారు ఆదివారం నాడు తన ప్రతాపం చూపాడు. 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన లెవీస్, 47 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను విరాట్ కోహ్లి, షమీలు కలిసి వదిలేసారు. అలాగే ఆ తర్వాత ఇచ్చిన మరో క్యాచ్ ను దినేష్ కార్తీక్ నేలపాలు చేయడంతో, రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరో సెంచరీ బాది, విండీస్ కు విజయాన్ని అందించాడు.

దీంతో 18.3 ఓవర్లలోనే కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాట్స్ మెన్లలో విరాట్ కోహ్లి 39, ధావన్ 23, పంత్ 38, దినేష్ కార్తీక్ 48 పరుగులతో రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది. అయితే 200 పై చిలుకు సాధించాల్సిన తరుణంలో… విండీస్ బౌలర్లు చివరి 7 ఓవర్లను అద్భుతంగా బౌల్ చేయడంతో 2 వికెట్లకు 151 పరుగులతో స్ట్రాంగ్ గా ఉన్న జట్టు 164 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.