విండీస్ ను 196 పరుగులకే ఆలౌట్ చేసి టీమిండియా బౌలర్లు తమ విధులను విజయవంతంగా పూర్తి చేయగా, బ్యాట్స్ మెన్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఓపెనర్ రాహుల్ 158 పరుగులతో సెంచరీ మోత మోగించడంతో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 126/1 తో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు రెండవ రోజు పూర్తయ్యే సరికి 358/5 పరుగులను నమోదు చేసింది.
విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రెండవ రోజు పరుగుల కోసం బ్యాట్స్ మెన్ కాస్తంత శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా పుజారా టెస్ట్ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ ఎలా ఆడాలో అన్నట్లు 159 బంతుల్లో 46 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. ఇక భారత ఇన్నింగ్స్ కు వెన్నుమూకగా నిలిచిన ఓపెనర్ రాహుల్ కూడా వేగంగా పరుగులు చేయడంలో తడబడ్డాడు. 303 బంతుల్లో 158 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో తదుపరి భారం కెప్టెన్ విరాట్ కోహ్లిపై పడింది.
అయితే 90 బంతుల్లో 44 పరుగులు చేసి ఊపు మీదున్నట్లు కనిపించిన కోహ్లి పెవిలియన్ బాట పట్టగా, తొలి టెస్ట్ మ్యాచ్ సెంచరీ వీరుడు అశ్విన్ 3 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో వికెట్ నేలకూలకుండా రెహనే, సాహాలు జాగ్రత్త పడ్డారు. 87 బంతుల్లో 42 పరుగులతో రెహనే, 43 బంతుల్లో 17 పరుగులతో సాహా క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 162 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాయి. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్ లో… ఆధిక్యాన్ని 300 పరుగులకు చేరిస్తే మ్యాచ్ దాదాపుగా భారత్ వశమైనట్లే భావించవచ్చు.