india Vs Srilanka Test Series - Bhuvneshwar Kumarఇండియా – శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఫలితం తేలలేదు గానీ, ఈ మ్యాచ్ మంచి ఉత్కంఠను అయితే రేపింది. తొలిరోజు శ్రీలంక డామినేషన్ తో ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్, చివరి రోజు ఇండియా విజయం సాధిస్తుందేమో అన్న అనుభూతితో ముగిసింది. మరో 10 ఓవర్ల పాటు మ్యాచ్ జరిగి ఉంటే ఖచ్చితంగా టీమిండియా ఖాతాలో మరో విజయం దక్కేదని చెప్పడంలో సందేహం లేదు.

మొదటి ఇన్నింగ్స్ లో 172 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్ లో మాత్రం స్థాయికి తగ్గట్లుగా రాణించి 352 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి మరో సారి సెంచరీతో రాణించి, భారత ఇన్నింగ్స్ వెన్నమూకగా నిలిచాడు. దీంతో శ్రీలంక విజయానికి షుమారు 45 ఓవర్లలో 231 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ భువనేశ్వర్ స్వింగ్ బౌలింగ్ మ్యాచ్ టీమిండియా వైపుకు తిరిగింది.

తొలి ఓవర్లోనే సమరవిక్రమ వికెట్ తో ప్రారంభమైన వేట టీమిండియా 26.3 ఓవర్లు వేసే సమయానికి 75 పరుగులకు 7 వికెట్లతో ముగిసింది. భువి 11 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. భువి బౌలింగ్ వేస్తున్నంత సేపు ప్రతి బాల్ కి వికెట్ పడుతుందేమో అన్న రేంజ్ లో వేయడంతో, భువి స్వింగ్ ను తట్టుకోవడం లంక బ్యాట్స్ మెన్ల వల్ల కాలేదు.

ఈ మ్యాచ్ లో టీమిండియా పడగొట్టిన ,మొత్తం 17 వికెట్లు ఫాస్ట్ బౌలర్లవే కావడం విశేషం. ఒక టెస్ట్ మ్యాచ్ లో స్పిన్నర్ వికెట్లు తీయకుండా 17 వికెట్లు సాధించడం ఇండియాలో ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి 50 అంతర్జాతీయ సెంచరీలను పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి టెస్ట్ మ్యాచ్ మజాను అయితే ఫైనల్ డే నాడు కావల్సినంత పంచిందనే చెప్పాలి.