India Vs Sri lanka Test Series Virat Kohliకొలంబో వేదికగా జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం సాధించి, మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో 183 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక జట్టు ఫాలో ఆన్ ఆడగా, రెండవ ఇన్నింగ్స్ లో 386 పరుగులు చేసి ఆలౌట్ అవ్వడంతో, 53 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఓపెనర్ కరుణరత్నే 141, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ మెండిస్ 110 సెంచరీలతో కదం తొక్కినా ప్రయోజనం లేకపోయింది.

టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో సత్తా చాటగా, పాండ్య, అశ్విన్ లు చెరో రెండు వికెట్లు, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ ను దక్కించుకున్నారు. ఆల్ రౌండ్ ప్రతిభ కనపరిచిన జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో వరుసగా ఎనిమిదవ టెస్ట్ సిరీస్ విజయం టీమిండియా ఖాతాలో చేరింది. వరుసగా అత్యధిక టెస్ట్ సిరీస్ లను దక్కించుకున్న జాబితాలో 9 సిరీస్ విజయాలతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అగ్ర స్థానంలో నిలువగా, తాజా సిరీస్ విజయంతో టీమిండియా రెండవ స్థానంలో నిలిచింది.

కోహ్లి సారధ్యంలో వరుసగా శ్రీలంకపై 2-1, దక్షిణాఫ్రికాపై 3-0, వెస్టీండీస్ పై 2-0, న్యూజిలాండ్ పై 3-0, ఇంగ్లాండ్ పై 4-0, బంగ్లాదేశ్ పై 1-0, ఆస్ట్రేలియాపై 2-1 కాగా, ప్రస్తుతం శ్రీలంకపై 2-0తో కైవసం చేసుకుంది. ఒక్క పాకిస్తాన్ మినహా, ప్రపంచంలోని అన్ని జట్లపై విజయాలు నమోదు చేసిన ఘనతను విరాట్ కోహ్లి అప్పుడే సొంతం చేసుకున్నాడు. ఇక శ్రీలంకలో అత్యధిక విజయాలు సొంతం చేసుకున్న జట్టుగా నాలుగు విజయాలతో ఆసీస్ తో సమానంగా నిలిచింది టీమిండియా.