India vs Sri Lanka Test Series 2017విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా శ్రీలంక గడ్డపై సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. క్రికెట్ మొదలుపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు సాధ్యం కానటువంటి ‘విదేశీగడ్డపై క్లీన్ స్వీప్’ను 71 ఏళ్ళ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా సాధించింది. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన జట్టుకు దేశవ్యాప్తంగా శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దూకుడైన ఆటతీరుతో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ గా సాధించిన అపూర్వమైన విజయం ఇది.

మూడవ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 487 పరుగులు చేసిన టీమిండియాకు బదులుగా తొలి ఇన్నింగ్స్ లో కేవలం 135 పరుగులు చేసిన శ్రీలంకకు ఫాలో ఆన్ ఇన్నింగ్స్ ఇవ్వగా, రెండవ ఇన్నింగ్స్ లో కూడా 181 పరుగులకే చాపచుట్టేసి మ్యాచ్ ను రెండున్నర్ర రోజులలోనే ముగించేసారు. దీంతో ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో భారత్ జయకేతనం ఎగురవేసి, సిరీస్ ను 3-0 తేడాతో గెలుపొందింది. ఈ రెండు ఇన్నింగ్స్ లలో ఒక్క శ్రీలంక బ్యాట్స్ మెన్ కనీసం హాఫ్ సెంచరీ కూడా సాధించకపోవడం విశేషం.

రెండవ ఇన్నింగ్స్ లో కీపర్ డిక్ వెల్లా సాధించిన 41 పరుగులే శ్రీలంక ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు కాగా, ఈ ఇన్నింగ్స్ లో అశ్విన్ 4 వికెట్లను తన ఖాతాలో వేసుకోగా, షమీ 3, ఉమేష్ యాదవ్ 2, కులదీప్ యాదవ్ 1 వికెట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మూడు టెస్ట్ మ్యాచ్ లలోనూ టీమిండియా మూడు సార్లు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా, మూడింటిలోనూ శ్రీలంక ఫాలో ఆన్ లో పడింది. అయితే తొలి మ్యాచ్ లో లంకకు ఫాలో ఆన్ ఇవ్వని కోహ్లి, తదుపరి రెండింటిలో ఫాలో ఆన్ ఇచ్చి ఇన్నింగ్స్ తేడాతోనే విజయం సాధించారు.

ఆడుతున్న రెండవ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ చేసి, భారీ స్కోర్ కు కారణమైన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించగా, రెండు సెంచరీలతో కదం తొక్కిన ఓపెనర్ శిఖర్ ధావన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లభించింది. గత కొంత కాలంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు, సిరీస్ లు వరుసగా అశ్విన్, జడేజాలకు సొంతమవుతున్న నేపధ్యంలో… ఈ సిరీస్ లో అన్ని బ్యాట్స్ మెన్ ఖాతాలోకే చేరుకోవడం విశేషం. మొత్తానికి కుంబ్లే తర్వాత అనేక మార్పుల నేపధ్యంలో జరిగిన టెస్ట్ సిరీస్ చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకుంది.