India Vs Sri lanka shikhar dhawanమూడు టెస్ట్ మ్యాచ్ లలో రెండు భారీ సెంచరీలు సాధించి, మ్యాచ్ లను వన్ సైడేడ్ గా మార్చేసిన శిఖర్ ధావన్ ప్రభావం వన్డేలలోనూ కొనసాగుతోంది. దంబుల్లా వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లోనూ తిరుగులేని సెంచరీని సాధించి, టీమిండియాకు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో విశేషం ఏమిటంటే… శ్రీలంకతో ఆడిన గత ఆరు మ్యాచ్ లలోనూ శిఖర్ ధావన్ అర్ధ సెంచరీకి పైగా స్కోర్ ను నమోదు చేసాడు.

అంతేగాక శ్రీలంక గడ్డపై ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఇండియన్ క్రికెటర్ గా కూడా శిఖర్ సరికొత్త రికార్డును నమోదు చేసాడు. కేవలం 71 బంతుల్లోనే 15 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ చేసిన శిఖర్ ధావన్ కంటే ముందు ఆల్ టైం జాబితాలో సెహ్వాగ్ (66 బంతుల్లో) మాత్రమే ఉన్నాడు. మొదటి 50 పరుగులు చేయడానికి 36 బంతులను తీసుకున్న ధావన్, తదుపరి 50 పరుగుల కోసం 35 పరుగులు మాత్రమే తీసుకున్నాడు.

ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు మొదటి 24.2 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 139 పరుగులు చేయగా, 43.2 ఓవర్ కు చేరుకునే సమయానికి 216 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ డిక్ వెల్లా (64) పతనం తర్వాత విరామం లేకుండా వికెట్లు నేలకూలాయి. ఈ స్వల్ప స్కోర్ ను టీమిండియా కేవలం 28.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి, శిఖర్ ధావన్ (90 బంతుల్లో 132), విరాట్ కోహ్లి (70 బంతుల్లో 82) అండతో ముగించేసింది.