India vs Sri Lanka cleansweep శ్రీలంక సిరీస్ ను టీమిండియా విజయవంతంగా ముగించింది. టెస్ట్ సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా, వన్డే సిరీస్ ను 5-0తో కొట్టగా, ఏకైక టీ20 మ్యాచ్ లోనూ విజయం సాధించి, ఆడిన 9 మ్యాచ్ లలోనూ 9-0తో శ్రీలంకపై జయకేతనం ఎగురవేసింది. టెస్ట్, వన్డేలలో ఘోర పరాభవాన్ని చవిచూసిన శ్రీలంక, ఏకైక టీ 20 మ్యాచ్ లో గట్టిపోటీ ఇస్తుందని భావించగా, ఆ ఆశలను భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్జీవం చేసాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన లంక 170 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. ఈ టూర్ లో వరుసగా విఫలం అవుతోన్న లంక బ్యాట్స్ మెన్లు ఈ మ్యాచ్ లో మాత్రం పర్వాలేదనిపించే విధంగా ప్రదర్శన ఇవ్వడంతో ఆ మాత్రం స్కోర్ అయినా నమోదయ్యింది. మునవీర (53), ప్రియంజన్ (40) పరుగులతో సత్తా చాటగా, టీమిండియా బౌలర్లలో చాహల్ 3, కులదీప్ యాదవ్ 2, భువనేశ్వర్ కుమార్, బూమ్రా చెరో వికెట్ ను సొంతం చేసుకున్నారు.

ఇక లక్ష్య చేధనలో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ (9) వికెట్ ను కోల్పోయింది. మరికొద్దిసేపటికే మరో ఓపెనర్ రాహుల్ (24) కూడా పెవిలియన్ చేరుకోవడంతో బాధ్యత అంతా విరాట్ కోహ్లి మరియు మనీష్ పాండేలపై పడింది. అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో దిట్ట అయిన కోహ్లి, తన అనన్యమైన బ్యాటింగ్ ప్రతిభతో మ్యాచ్ ను టీమిండియా వైపుకు తిప్పి, మరో విజయాన్ని అందించాడు.

కేవలం 54 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ తో 82 పరుగులు చేసిన కోహ్లి, విజయానికి మరో 10 పరుగుల దూరంలో అవుట్ కాగా, మిగిలిన తంతును మనీష్ పాండే (36 బంతుల్లో 51) పూర్తి చేసాడు. దీంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అద్వితీయమైన బ్యాటింగ్ ప్రతిభతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు సిరీస్ అవార్డును సొంతం చేసుకున్నాడు విరాట్.

‘చేజింగ్’ అంటే పూనకం వచ్చినట్లు ఆడే విరాట్ కోహ్లి, పొట్టి ఫార్మాట్ లో కూడా తనదైన శైలిలో బ్యాటింగ్ ప్రదర్శన ఇచ్చి, శ్రీలంక పరువు తీసేసాడు. ఈ క్రమంలో టీ20లలో చేజింగ్ లలో అత్యధిక పరుగులు చేసిన కివీస్ క్రికెటర్ బ్రాండన్ మెక్కలమ్ ను దాటి సరికొత్త రికార్డును తన పేరుతో లిఖించుకున్నాడు. ఇలా చేజింగ్ లలో విరాట్ విరుచుకుపడితే ఏ టీం అయినా చేయగలిగేదేముంది… దాసోహం అనడం తప్ప..!

టెస్ట్, వన్డే, టీ20 అన్న తేడా లేకుండా విరాట్ చూపిస్తున్న బ్యాటింగ్ ప్రతిభకు ముగ్దులవ్వడం వీక్షకుల వంతవుతోంది. బహుశా సచిన్ తర్వాత ఆ స్థాయి రికార్డులన్నింటినీ పటాపంచలు చేయగల క్రికెటర్ గా క్రీడా విమర్శకుల చేత నీరాజనాలు అందుకుంటున్నాడు విరాట్. ఇలా అమోఘమైన బ్యాటింగ్ ప్రదర్శనలు ఇస్తుంటే… ప్రత్యర్ధి జట్లు ‘విరాట్ ఉంటే మేం ఆడం’ అనే స్థాయికి వస్తారేమో… అన్నంతగా చీల్చిచెండాడుతున్నాడు.