India-Vs-South-Africa-Test-Series-Virat-Kohliప్రపంచ క్రికెట్ లో ఒకప్పుడు సచిన్ పేరు ఎలా మారుమ్రోగిందో, ప్రస్తుతం విరాట్ కోహ్లి పేరు అంతకంటే ఎక్కువగా హంగామా చేస్తోంది. అలా చేయడానికి పూర్తి అర్హతను కూడా విరాట్ కోహ్లి సంపాదించాడు. సచిన్ బ్యాటింగ్ లో అద్భుతాలు సృష్టించినా… ఒక కెప్టెన్ గా, కెప్టెన్ కం బ్యాట్స్ మెన్ గా విఫలమయ్యాడు. కానీ కోహ్లి ఈ విభాగంలో కూడా అద్భుతంగా, అంచనాలకు మించిన రీతిలో రాణిస్తుండడంతో… ప్రపంచమంతా విరాట్ కోహ్లిని పొగడ్తలతో ముంచెత్తుతోంది.

మొన్నటివరకు ఇండియాలోనే కదా సెంచరీలు బాదింది… సఫారీ గడ్డపై ఏ మాత్రం ప్రతిభ చూపిస్తారో చూద్దాం… అని వేచిచూసిన విమర్శకులకు తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు విరాట్. టీం అంతా విఫలమవుతున్న సమయంలో టీమిండియా ఇన్నింగ్స్ కు వెన్నమూకలా నిలిచి, భారీ ఆధిక్యం సఫారీ వశం కాకుండా కాపాడగలిగాడు. కెరీర్ లో 21వ టెస్ట్ సెంచరీ చేసిన విరాట్, బహుశా ది బెస్ట్ టెస్ట్ సెంచరీగా దీనిని పేర్కొనేలా తన ఆట తీరును ప్రదర్శించాడు.

తగ్గాల్సిన తగ్గి సింగిల్స్ తీసి, కొట్టాల్సిన టైంలో బౌండరీలు బాదుతూ… టీమిండియాను గౌరవప్రదమైన 307 పరుగులకు చేర్చాడు. దీంతో 28 పరుగులు మాత్రమే దక్షిణాఫ్రికా ఆధిక్యం పొందగలిగింది. కోహ్లికి ఒక్క అశ్విన్ (38) మినహా ఎవరూ అండగా నిలవలేదు. చివర్లో కాసేపు ఇషాంత్ శర్మ క్రీజులో ఉండడంతో ఆ 300 మార్క్ అయినా దాటగలిగింది. రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సఫారీలు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా, డివిలియర్స్, ఎల్గర్ లు క్రీజులో నిలవడంతో, వర్షం అడ్డు పడే సమయానికి 68 పరుగులు చేసి, ఓవరాల్ గా 96 పరుగుల లీడ్ లో ఉంది.

ఇంకా టెస్ట్ లో రెండు రోజుల సమయం మిగిలి ఉన్నందున ఫలితం రావడానికే అవకాశాలు ఎక్కవ. అయితే ప్రస్తుత పరిస్థితిలో నాలుగవ ఇన్నింగ్స్ లో 200 పరుగుల కంటే ఎక్కువ చేజింగ్ చేయడం అసాధ్యంలా కనపడుతున్న తరుణంలో…. ప్రస్తుతానికి మ్యాచ్ సఫారీ సైడ్ ఉందని చెప్పవచ్చు. నాలుగవ రోజు బౌలర్లు అద్భుతాలు చేస్తే తప్ప ఈ టెస్ట్ లో పుంజుకోవడం అసాధ్యంలా కనపడుతోంది. మొదటి టెస్ట్ లో ఓటమి పాలు కావడంతో, ఈ మ్యాచ్ లో టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. విరాట్ ప్రదర్శించిన అద్భుతమైన ఇన్నింగ్స్ వృధా పోకుండా ఉండాలి అంటే… జట్టులోని పదకొండు సభ్యులు తలో చేయి వేయాల్సిందే!