India vs South Africa, 3rd Testదక్షిణాఫ్రికాతో తలపడిన మూడు టెస్ట్ మ్యాచ్ సిరీస్ ను టీమిండియా 2-1తేడాతో చేజార్చుకుంది. వరుస టెస్ట్ విజయాలతో అగ్ర స్థానంలో ఉన్న టీమిండియా, మొదటి రెండు మ్యాచ్ లలో ఓటమి పాలై, మూడవ టెస్ట్ లో పుంజుకుని సఫారీలను మట్టి కరిపించింది. విరాట్ కోహ్లి నాయకత్వంలో మొదటి టెస్ట్ సిరీస్ ను కోల్పోయిన టీమిండియా, ఇదే దూకుడు వన్డేలలో కొనసాగిస్తే చరిత్ర తిరగరాయడం ఖాయం.

ఈ సిరీస్ లో టీమిండియాకు బౌలింగ్ విభాగంలో ఎంత బలముందో ప్రపంచానికి చాటిచెప్పినట్లయ్యింది. బౌలింగ్ ఎంత బలంగా ఉందో, బ్యాటింగ్ విభాగంలో అంత డొల్ల ఉందని తెలియడమే కాకుండా, సిరీస్ ను చేజార్చుకునేలా చేసింది మాత్రం ఫీల్డర్లు అనే చెప్పాలి. అవును… మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లలో సఫారీ బ్యాట్స్ మెన్లు ఇచ్చిన క్యాచ్ లను గనుక పట్టుకుని ఉంటే, సిరీస్ ఫలితం వేరేగా ఉండేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

మూడవ టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఫీల్డర్లు కూడా టీమిండియాను ఆదర్శంగా తీసుకుని, విరాట్ కోహ్లితో సహా నాలుగైదు తేలిక క్యాచ్ లను జారవిడిచారు. దీంతో సొంతగడ్డపై సఫారీలకు పరాభవం తప్పలేదు. ఇదే సమయంలో కష్టమైన క్యాచ్ లను కూడా టీమిండియా ఫీల్డర్లు అందుకోవడం విశేషం. దీంతో ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అనేది మరోసారి ఈ సిరీస్ ద్వారా నిరూపణ అయ్యింది. చేసిన తప్పులను వన్డే సిరీస్ లో సరిచేసుకుంటే, దక్షిణాఫ్రికాతో లెక్కలు తేల్చుకోవచ్చు.