India-vs-South-Africa-2nd-Testవరుస విజయాలతో క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగిన టీమిండియా పేరు పది కాలాల పాటు పదిలంగా నిలబడాలంటే… సఫారీ గడ్డపై సిరీస్ ను నెగ్గుకు రావాల్సిందే! తొలి టెస్ట్ లో దారుణ పరాజయం పాలై డిఫెన్స్ లో ఉన్న టీమిండియా, శనివారం నుండి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కు రెడీ అయ్యింది. బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ, 208 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక బ్యాటింగ్ లో ఉన్న లోపాలను బట్టబయలు చేసుకుంది. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ అనేది గత వారం రోజులుగా హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా ఓపెనర్ గా రాహుల్ మరియు మిడిల్ ఆర్డర్ లో అజెంకా రెహనేలకు చోటు ఇవ్వాలని విమర్శలు రావడంతో, వాటికి ధీటుగా బదులిచ్చిన కోహ్లి, మైదానంలో కూడా సఫారీలకు అంతే ధీటుగా బదులు ఇవ్వగలగాలి. “ఒక వారం రోజుల ముందు వరకు అద్భుతంగా కనిపించిన టీంలో ఇప్పుడు అన్నీ బొక్కలు కనపడుతున్నాయా? అయినా బయట వ్యక్తులు ఎంపిక చేసిన 11 మందితో తాము క్రికెట్ ఆడాలా?” అంటూ విరాట్ కోహ్లి నేడు విమర్శలకు స్ట్రాంగ్ గా బదులిచ్చారు.

మాటల్లోనే కాదు, మైదానంలో కూడా దక్షిణాఫ్రికా జట్టుకు ఇంతే స్ట్రాంగ్ గా సమాధానం చెప్తే… అప్పుడు టీమిండియా సత్తా ఏమిటో తెలిసి వస్తుంది. నిజానికి ఈ టూర్ టీమిండియాకు అగ్ని పరీక్ష లాంటిది. ఏషియన్ పిచ్ లపై అద్భుతంగా రాణిస్తున్నారు తప్ప, విదేశాలలో అంత సీన్ లేదని విమర్శలు చేసిన వారందరికీ సమాధానం చెప్పాలంటే ఈ సిరీస్ లో గొప్పగా రాణించాల్సిందే. లేదు తొలి టెస్ట్ లో మాదిరే ప్రదర్శనలు కొనసాగితే మాత్రం…. ‘విరాట్ కోహ్లి అండ్ కో’ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోక తప్పదు. మూడు టెస్ట్ ల సిరీస్ కాబట్టి, ఇందులో నిలబడాలంటే రెండవ టెస్ట్ లో టీమిండియా విజయం అనివార్యంగా మారింది.