India vs South Africa 2018దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా పేలవమైన బ్యాటింగ్ ప్రతిభ కొనసాగుతోంది. ‘ఇంట్లో పులి – వీధిలో పిల్లి’ అన్న సామెతను నిరూపించే విధంగా తాజాగా ప్రారంభమైన మూడవ టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 187 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ విరాట్ కోహ్లి (54), పుజారా(50) లు తప్ప ఎవరూ స్థాయికి తగిన విధంగా రాణించలేదు. ప్రధాన బ్యాట్స్ మెన్ల కంటే తానే బెటర్ అంటూ మరోసారి భువనేశ్వర్ కుమార్ 30 పరుగులు చేయడంతో, కనీసం ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది.

దీంతో టీమిండియాకు ‘వైట్ వాష్’ గండం పొంచి ఉందని చెప్పవచ్చు. నిజానికి గడిచిన రెండు మ్యాచ్ లలోనూ రెండవసారి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా, నాలుగవ ఇన్నింగ్స్ లో లక్ష్యాలను చేధించలేక ఓటమి పాలయ్యింది. సిరీస్ లో మొదటిసారిగా తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినప్పటికీ, దానిని సద్వినియోగం చేసుకోవడంలో బ్యాట్స్ మెన్లంతా మూకుమ్మడిగా విఫలమయ్యారు. పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తున్న మాట వాస్తవం అయినప్పటికీ, క్రీజులో కాసేపు నిలబడాలన్న ఉత్సాహం లేకపోవడం గమనించదగ్గ అంశం.

ఆట ముగిసే సమయానికి సఫారీలు కూడా ఒక వికెట్ కోల్పోయినప్పటికీ, సొంతగడ్డ కనుక టీమిండియా కంటే మెరుగైన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శిస్తోంది. అయితే రెండవ టెస్ట్ లో మిస్ అయిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పైనే టీమిండియా ఎక్కువ ఆశలు పెట్టుకుందని చెప్పవచ్చు. సఫారీ గడ్డ స్వింగ్ బౌలర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది గనుక, భువనేశ్వర్ రాణిస్తే సఫారీలను కట్టడి చేయవచ్చు. ‘వైట్ వాష్’ నుండి బయటపడాలంటే టీమిండియా సమిష్టిగా రాణించాల్సిన సమయం ఆసన్నమైంది.