India Vs Pakisthan Finals Champions Trophy2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ క్రికెట్ ప్రేమికులకు అద్భుతమైన అనుభూతిని మిగల్చబోతుందన్న సంకేతాలను కనపరుస్తోంది. అవును… లీగ్ మ్యాచ్ లలో ఇండియా చేతిలో మట్టి కరిచిన యువ పాకిస్తాన్ జట్టు, ఆ తర్వాత విశేషంగా రాణించి ఏకంగా కప్ కొట్టే వరకు చేరుకోవడం విశేషం. ఇండియా మీద పేలవమైన ప్రదర్శన ఇచ్చిన పాకిస్తాన్ జట్టుపై విమర్శలు ఓ రేంజ్ లో వెల్లువెత్తగా, ఆ తర్వాత దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి భారీ షాక్ ఇచ్చారు. అదే ఊపులో శ్రీలంకపై కూడా నెగ్గి సెమీస్ కు చేరింది పాకిస్తాన్.

అయితే సెమీస్ లో తలపడనున్న ఇంగ్లాండ్ జట్టు అత్యంత పటిష్టమైనది కావడంతో… పాకిస్తాన్ పప్పులు ఉడకవని భావించిన క్రికెట్ పండితులకు మరో షాక్ ని ఇచ్చింది. వరుసగా తొలుత బౌలింగ్ చేస్తూ ప్రత్యర్ధి జట్లను మట్టికరిపిస్తున్న బౌలర్లు, ఈ మ్యాచ్ లోనూ అద్భుతమైన ప్రదర్శన కనపరిచి, కేవలం 211 పరుగులకే ఇంగ్లాండ్ ను నిలువరించగలిగారు. బైర్ స్టో, హేల్స్, రూట్, మోర్గాన్, బట్లర్, స్టోక్స్ వంటి హేమాహేమీలను ఓ మాత్రం స్కోర్ కే కట్టడి చేయడంలో సఫలీకృతం అయ్యారు.

ముఖ్యంగా ఆల్ రౌండర్ గా విశేషంగా రాణిస్తున్న బెన్ స్టోక్స్ 64 బంతులాడి ఒక్క బౌండరీ కూడా సాధించలేదు అంటే… ఏ రేంజ్ లో పాకిస్తాన్ బౌలర్లు కట్టడి చేసారో అర్ధం చేసుకోవచ్చు. అది కూడా చివరి 15 ఓవర్లలో బెన్ స్టోక్స్ బ్యాటింగ్ చేసి, ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడు. ఇది నిజంగా పాకిస్తాన్ బౌలర్లకు నిదర్శనంగా చెప్పాలి. ఏదైనా ఒక మ్యాచ్ లో అయితే… ఏదో ఫ్లూక్ లో వేసారులే అనుకోవచ్చు. కానీ మ్యాచ్ మ్యాచ్ కు పాక్ బౌలర్లు అద్భుతంగా రాణిస్తూ మ్యాచ్ విజయాలలో కీలక భూమిక పోషిస్తున్నారు.

ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ అమీర్ ఆడకపోయినప్పటికీ, అతని స్థానంలో బాల్ అందుకున్న రీస్ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకోగా, జునైద్ ఖాన్ 2 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇక మిడిల్ ఓవర్స్ లో అద్భుతంగా వేస్తున్న హసన్ అలీ 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లను సొంతం చేసుకుని ఇంగ్లాండ్ వెన్నువిరిచాడు. ఇంతకు ముందు వరకు ఫీల్డింగ్ లో వైఫల్యం సృష్టించిన పాక్, సెమీస్ లో మాత్రం అద్భుతమైన ఫీల్డింగ్ ప్రతిభను కనపరిచారు. ఇక విజయానికి కావాల్సిన మిగిలిన బాధ్యతను లక్ష్య చేధనలో బ్యాట్స్ మెన్లు పంచుకుంటున్నారు.

ఇక ఎలాంటి సంచలనాలు నమోదు కాని పక్షంలో రెండవ సెమీస్ లో బంగ్లాదేశ్ పై టీమిండియా విజయం సాధించడం తధ్యం గనుక… ఫైనల్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయని క్రికెట్ ప్రేమికులు ఇప్పటినుండే పండగ చేసుకుంటున్నారు. క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఒక్క విషయం పక్కన పెడితే… బంగ్లాదేశ్ పై టీమిండియా ఆధిపత్యం కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే… ఫైనల్ లో పాకిస్తాన్ తో తలపడే మ్యాచ్ మరోసారి ప్రేక్షకులను రంజింప చేయడం ఖాయం.

చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీ20 వరల్డ్ కప్ లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా జయకేతనం ఎగురవేసి వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ తర్వాత ధోని పూర్తి స్థాయి కెప్టెన్ గా టీమిండియాకు పగ్గాలు చేపట్టాడు. చివరి ఓవర్ లో జోగిందర్ శర్మ వేసిన బంతిని స్వీప్ ఆడబోయిన మిసాబ్ హాల్ హక్ శ్రీశాంత్ కు దొరికిపోయిన క్యాచ్… ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.