India Vs Pakistan ICC Champions Trophy 2017ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరికీ ఈ రోజు ప్రత్యేకం. ఏ మ్యాచ్ ను వీక్షించినా, లేకున్నా ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ను మాత్రం క్రికెట్ ప్రేమికులు తిలకించకుండా ఉండలేరు. ఆ రోజు రానే వచ్చింది. టోర్నీ మొత్తం ఒకెత్తు అయితే ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ మరో ఎత్తు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు అభినందనలు, ఓడిన జట్టుకు ఆ దేశ ప్రజలు నిరసనలు తెలపడం సర్వ సాధారణం. అయితే అదృష్టవశాత్తు ఇండియాకు అలాంటి అనుభూతులు ఎదురుకాలేదు.

ఐసీసీ నిర్వహించిన టోర్నమెంట్ లలో పాకిస్తాన్ పై భారత్ దే పైచేయి. దీంతో ఈ మ్యాచ్ లో కూడా ఇండియానే విజయం సాధిస్తుందని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ వార్మప్ లో జరిగిన రెండు మ్యాచ్ లలోనూ జయకేతనం ఎగురవేయడంతో పాటు విరాట్ కోహ్లి నేతృత్వంలోని జట్టు అద్భుతమైన ప్రతిభను కనపరుస్తోంది. హాట్ ఫేవరేట్ గా ఇండియా బరిలోకి దిగుతున్నప్పటికీ, పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి.

ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని ఎంతలా తాపత్రయ పడుతుందో, పాకిస్తాన్ అంతకు మించి ప్రయత్నాలు చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అందులోనూ ఐసీసీ టోర్నమెంట్స్ లో ఇండియాకు ఎదురు నిలవలేదన్న విశ్లేషణలు పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఒక రకంగా ఇదే ఇండియాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సహజంగా ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అనగానే పాక్ జట్టు తీవ్ర ఒత్తిడికి గురై, కనీసం పోరాటపటిమను కూడా ప్రదర్శించలేని మ్యాచ్ లను తిలకించాం. వాతావరణం అనుకూలిస్తే ఈ మ్యాచ్ మాత్రం మంచి రసవత్తరంగా సాగుతుందని క్రికెట్ ప్రేమికులు భావిస్తున్నారు.