India vs Pakistan Champions Trophy 2017సమయం, సందర్భం లేకుండా… ఎప్పుడు ఇండియా – పాకిస్తాన్ జట్లు తలపడినా… క్రికెట్ ప్రపంచం మొత్తం ఆ వైపుగా చూడడం సహజం. ఆ మాటకొస్తే… ఒక్క క్రికెట్ అభిమానులే కాదు, కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ మ్యాచ్ ద్వారా తమ ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే… మధ్యలో యాడ్స్ వచ్చినా ఛానల్ మార్చకుండా మ్యాచ్ మొత్తం చూసే రేంజ్ ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కే ఉంటుంది గనుక..!

అందులోనూ ఆదివారం జరగబోయే మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గనుక మరింత ఉత్కంఠగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మరి అలాంటి సందర్భాన్ని ‘క్యాష్’ చేసుకోవాలని ఎవరికీ మాత్రం ఉండదు. అందులో భాగంగానే ఈ సిరీస్ ను టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తమ యాడ్ టారిఫ్ లను ఏకంగా 10 రెట్లు పెంచేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎంత పెంచినా, ఇంకా డిమాండ్ ఉండడం మరో కొసమెరుపు.

కోట్లాది మంది టీవీ స్క్రీన్లకు అతుక్కుపోయేలా చేసే ఈ మ్యాచ్ లో యాడ్లను ప్రసారం చేయాలంటే… 30 సెకండ్ల యాడ్ కు గానూ అక్షరాలా కోటి రూపాయలను వసూలు చేయబోతున్నట్లుగా సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే కంపెనీలకు చెప్పినప్పటికీ, అందుకు కార్పొరేట్ దిగ్గజాలు కూడా ‘సై’ అనడం విశేషం. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ కు కాసుల పంట పండించేదిగా మారిపోయింది. ఇండియా – పాక్ మ్యాచా… మజాకా..!

ఇక ఈ మ్యాచ్ పై జరిగే బెట్టింగ్ కు అంతే లేదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మ్యాచ్ పై అంతర్జాలం వేదికగా 2,000 కోట్ల విలువ మేర పందేలు జరుగుతున్నట్టు అఖిల భారత గేమింగ్ ఫెడరేషన్ (ఏఐజీఎఫ్) పేర్కొంది. ఎక్కువ మంది బుకీలు భారత్ కు ఫేవర్ గా ఉండగా, భారత్ పై 100 పందేం వేస్తే… ఒకవేళ కోహ్లీ సేనే గెలిస్తే 147 గెలుచుకుంటారు. భారత్ ఓడి పాక్ ను విజయం వరిస్తే 300 సొంతం చేసుకునే విధంగా బెట్టింగ్ రాయుళ్ళు రంగంలోకి దిగినట్లుగా పేర్కొంటున్నారు.