India Vs Newzealand Kanpur Test matchభారత జట్టు ఆడుతోన్న 500వ టెస్ట్ మ్యాచ్ గా ఎంతో ప్రాధాన్యతను దక్కించుకున్న కాన్పూర్ టెస్ట్ లో టీమిండియాకు అదృష్టం కలిసి రావడం లేదు. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 318 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా, తర్వాత బౌలింగ్ లోనూ ఆశించిన స్థాయిలో ప్రతిభను ప్రదర్శించలేకపోయింది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ కివీస్ బ్యాట్స్ మెన్లు స్కోర్ బోర్డును 150 పరుగులు దాటించడంలో సఫలమయ్యారు.

ఈ ప్రయాణంలో కేవలం ఒకే ఒక వికెట్ ను కివీస్ కోల్పోయింది. ఇంతలో వరుణుడు మైదానంలో ప్రత్యక్షం కావడంతో, ఆటకు అడ్డంకి వచ్చినట్లయ్యింది. అప్పటికి క్రీజులో లథం 56, విలియమ్సన్ 65 పరుగులతో ఉన్నారు. కానీ, లథం వ్యక్తిగత స్కోర్ 47 వద్ద ఉండగా, మైదానంలో ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. జడేజా వేసిన బంతిని లథం స్వీప్ షాట్ ఆడగా, బ్యాట్ కు తగిలిన బంతి నేరుగా లథం బూట్లకు తగిలి కేఎల్ రాహుల్ చేతిలో పడింది. దీంతో టీమిండియా ఫీల్దర్లంతా అవుట్ కోసం అప్పీల్ చేసారు.

స్పష్టత కోసం మైదానంలో ఉన్న ఎంపైర్ లు థర్డ్ ఎంపైర్ కు రిఫర్ చేయగా, వీడియో చూసిన థర్డ్ ఎంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో నిరుత్సాహపడడం టీమిండియా వంతయ్యింది. అయితే లథం కొట్టిన బంతిని అందుకున్న రాహుల్, చేతిలో బాల్ రెండు సార్లు మిస్ కాగా, ఈ కుదుపులలో బాల్ కాస్త రాహుల్ ధరించిన హెల్మెట్ ను తాకింది. దీంతో రాహుల్ క్యాచ్ అందుకున్నప్పటికీ, హెల్మెట్ ను తాకడం వలన ఎంపైర్ నాటౌట్ గా ప్రకటించారు. అందివచ్చిన అవకాశం కూడా టీమిండియాకు ఇలా చేజారిపోయింది.