india-vs-new-zealandరెండో రోజూ మ్యాచ్ వర్షార్పణం కావడంతో… ఎటు పయనిస్తుందో అన్న ఊహాగానాలకు టీమిండియా స్పిన్నర్లు తెరదించారు. ఒక వికెట్ నష్టానికి 159 పరుగులతో పటిష్టంగా ఉన్న కివీస్ జట్టు వెన్నువిరిచారు టీమిండియా స్పిన్ ద్వయం. లథం వికెట్ తో ప్రారంభమైన పతనం 262 పరుగుల వద్ద బోల్ట్ వికెట్ తో ముగిసింది. పిచ్ స్పిన్ కు అనుకూలంగా ఉండడంతో అశ్విన్, జడేజా మ్యాజిక్ కు కివీస్ బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. విలియమ్సన్ 75, లథం 58, రాంచి 38, సాట్నర్ 32 పరుగులతో రాణించగా, అశ్విన్ 4, జడేజా 5 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇక, రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా రాహుల్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ 8 ఫోర్లతో 38 పరుగులు చేసి, స్కోర్ బోర్డు 52 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత మురళీ విజయ్ కు జత కట్టిన పుజారా మరో వికెట్ పడకుండా నింపాదిగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్ కు అబేధ్యమైన 107 పరుగులు జోడించడంతో, మూడవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 1 వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది.

రెండు రోజులు ఆట మిగిలి ఉండగా, టీమిండియా 215 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసి కనీసం 200 పరుగులు చేయగలిగితే మ్యాచ్ పై భారత్ పూర్తి ఆధిపత్యం చలాయించగలుగుతుంది. వరుణుడు కరుణిస్తే… ఒక రకంగా మ్యాచ్ ను గెలిచే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. టీమిండియా ఆడుతున్న 500వ మ్యాచ్ గా ఈ టెస్ట్ కు విశిష్టత లభించడంతో… టీమిండియా గెలుపు అటు జట్టుకు, ఇటు క్రికెట్ ప్రేమికులకు మరింత ఉత్సాహాన్ని పంచుతుంది.