India Vs New Zealand T20 World Cup 2016అబ్బా… మరో 20 పరుగులు కివీస్ జట్టు చేసి ఉంటే, మ్యాచ్ లో మరింత మజా ఉండేది… అయితే అసలు ఈ 127 పరుగులను టీమిండియా ఎన్ని ఓవర్లలో కొట్టేస్తుందో చూద్దాం… అంటూ టీమిండియా అభిమానులు ఆలోచించారని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా టీమిండియా ప్రదర్శన అలా ఉంది… అంతేకాక శిఖర్ ధావన్ నుండి అశ్విన్ వరకు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. అభిమానుల్లో జట్టు పట్ల ఎంత విశ్వాసం ఉందో, లక్ష్య చేధనలో టీమిండియా బ్యాట్స్ మెన్లు కూడా అంతకు మించిన విశ్వాసంతో బరిలోకి దిగారు.

అయితే ‘ఆత్మ విశ్వాసం’ను మించిపోయే స్థాయిలో ‘అతి విశ్వాసం’ (ఓవర్ కాన్ఫిడెన్స్) టీమిండియా పాలిట శాపంగా మారింది. నిర్లక్ష్యమైన షాట్లకు నిదర్శనం ఏమిటో కివీస్ బౌలర్ వేసిన మొదటి బాల్ కు రోహిత్ శర్మ ఆడిన తీరు అద్దం పట్టింది. అదే ఓవర్లో ధావన్ వికెట్ కోల్పోయినపుడు గానీ, అలాగే రోహిత్ శర్మ స్టంప్ అవుట్ అయినపుడు గానీ రాని ఆందోళన 12 పరుగులకే మూడవ వికెట్ రూపంలో రైనా అవుట్ అయిన అనంతరం ఒక్కసారిగా మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఇది కాస్త యువరాజ్ సింగ్ అవుట్ తో మరింత బలపడింది. ఇక, 39 పరుగుల వద్ద 5వ వికెట్ గా విరాట్ కోహ్లి అవుటవ్వడంతో ఈ మ్యాచ్ లో భారత్ పరాజయం ఖాయమని భావించడం మొదలైంది.

ఆ ఆలోచనకు మరో ఆస్కారం లేకుండా మిగిలిన బ్యాట్స్ మెన్లు కూడా వరుసపెట్టి పెవిలియన్ కు ‘క్యూ’ కట్టడంతో 79 పరుగుల వద్ద టీమిండియా ఆల్ అవుట్ అయ్యి, 47 పరుగుల భారీ విజయాన్ని కివీస్ సొంతం చేసింది. ఇప్పటివరకు భారత బ్యాట్స్ మెన్లు చూడని కొత్త బౌలర్ శాంటార్ కు 4 ప్రధాన వికెట్లు సమర్పించుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ టీమిండియా నిర్లక్ష్యపు వైఖరిని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో కివీస్ జట్టు సఫలమైంది. ఈ పరాజయంతో కివీస్ తో వరుసగా 5వ టీ 20 ఓటమిని నమోదు చేసుకుంది టీమిండియా.