india-new-zealand-match-2016ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన 500వ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా జయకేతనం ఎగురవేసి, దేశ పరువు నిలిపింది. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత చెలరేగిన అసంతృప్తిని అయిదో రోజు ముగిసేపాటికి పూర్తిగా తొలగించడంలో భారత జట్టు సక్సెస్ అయ్యింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆల్ రౌండర్ గా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

చివరి రోజు 93/4 తో బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ బ్యాట్స్ మెన్లు రాంకీ, సాట్నార్ లు టీమిండియా స్పిన్నర్లను ప్రతిఘటించి, స్కోర్ బోర్డును ముందుకు కదిలించారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి మంచి ఊపులో ఉన్న సమయంలో రవీంద్ర జడేజా రాంకీ (80)ని పెవిలియన్ పట్టించడంతో, వికెట్ల పతనం ప్రారంభమైంది. ఇక, మిగిలిన తంతును ప్రధాన స్పిన్నర్ అశ్విన్ పూర్తి చేసాడు.

6 వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించిన అశ్విన్, ఈ మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు. 37 టెస్టుల్లో 200 వికెట్లను సాధించి, అతి తక్కువ మ్యాచ్ లలో 200 వికెట్లు సాధించిన జాబితాలో రెండవ స్థానంలో నిలిచారు. అలాగే ఈ మ్యాచ్ లో మరో అరుదైన రికార్డు కూడా నమోదైంది. ఒక టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక అర్ధ సెంచరీలు (10) నమోదైన మ్యాచ్ గా రికార్డులకెక్కింది. మొత్తానికి 500వ టెస్ట్ మ్యాచ్ టీమిండియాకు తీపి గుర్తులను మిగిల్చింది.