kohli-test-matchగత రెండు టెస్టులలో ఘోరంగా విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, చివరిదైన మూడో టెస్ట్ లో సత్తా చాటాడు. 100 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను కెప్టెన్ కోహ్లి, అజెంకా రెహానేలు ఆదుకున్నారు. వీరిద్దరూ అబేధ్యమైన నాలుగవ వికెట్ కు 167 పరుగులు నమోదు చేయడంతో, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 267 పరుగులతో పటిష్ట స్థితిలో టీమిండియా నిలిచింది.

వరుసగా మూడవ సారి కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. స్పిన్నర్ జీతన్ పటేల్ వేసిన ఓ బంతిని లెగ్ సైడ్ ఫ్లిక్ చేసిన మురళీ విజయ్, షార్ట్ లెగ్ లో ఉన్న లథంకు దొరికిపోయాడు. దీంతో ఊహించని విధంగా విజయ్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే మరో ఎండ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ గంభీర్ పైనే అందరి చూపులు పడ్డాయి. భారీ ఇన్నింగ్స్ కు బాటలు వేస్తున్నాడు అనుకున్న తరుణంలో వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుతిరిగాడు. ఆదిలోనే రెండు సిక్సర్లు బాది, తనలో కసి ఏ మాత్రం ఉందో సెలక్టర్లకు చాటిచెప్పాడు గానీ, అది షార్ట్ ఇన్నింగ్స్ తోనే ముగియడం నిరాశజనకంగా మారింది.

ఇక, ఈ సిరీస్ లో నిలకడగా ఆడుతున్న పుజారా 41 పరుగులకు వెనుతిరగగా, ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతలను కోహ్లి – రెహానేలు తీసుకున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ… నింపాదిగా బ్యాటింగ్ చేసిన ఈ జోడి వలన టీమిండియా తొలిరోజు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట ముగిసే సమయానికి కోహ్లి 191 బంతుల్లో 103 పరుగులు (కెరీర్ లో 13వ సెంచరీ) చేయగా, రెహానే 172 బంతుల్లో 79 పరుగులతో క్రీజులో నిలిచారు. ప్రస్తుతం ఉన్న స్కోర్ కు మరో 200 పరుగులు జోడిస్తే… ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా ఆధిపత్యానికి ఎదురు ఉండకపోవచ్చు.