india vs england 2016మహేంద్ర సింగ్ ధోని నుండి టెస్ట్ మ్యాచ్ లకు నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత నుండి యువకెరటం విరాట్ కోహ్లి సారధ్యంలో టీమిండియా మునుపెన్నడూ లేనంతగా చెలరేగిపోతోంది. ధోని కెప్టెన్సీ లో ఒక్క సిరీస్ గెలవడమే కష్టసాధ్యంగా మారిన జట్టు, కోహ్లి నాయకత్వంలో వరుసగా అయిదో సిరీస్ ను అందిపుచ్చుకుంది. అయితే అన్ని సిరీస్ విజయాలలోకల్లా ప్రస్తుతం ఇంగ్లాండ్ పై సాధిస్తున్న ఘనవిజయానికి అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. అయిదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు ముగిసే సమయానికి 3-0 ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ సిరీస్ ను ఇప్పటికే సొంతం చేసుకున్నారు.

అయితే ఇంత ఘోర ఓటమిని భరించలేని ఇంగ్లాండ్ ఆటగాళ్ళు సంచలన ఆరోపణలకు తెరతీసారు. టీమిండియా గెలుపు కేవలం స్లో పిచ్ లే కారణమని, స్పిన్ కు అనుకూలించే పిచ్ లను కోహ్లి తయారు చేయించుకున్నాడని ఇంగ్లాండ్ పేస్ బౌలర్ ఆండర్సన్ టీమిండియా కెప్టెన్ పై సంచలన ఆరోపణలు చేసారు. పిచ్ లను రూపొందించడంలో పాటించాల్సిన సాంకేతిక పద్ధతులను అనుసరించలేదని అన్న ఆండర్సన్, గతంలో తన జట్టు ఏం చేసిందో మరిచిపోయినట్లున్నారు. 2014లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన చేసినపుడు… అన్ని బౌన్సీ, ఫాస్ట్ పిచ్ లను తమకు అనుకూలంగా తయారు చేసుకుని, భారత జట్టును ఓడించినపుడు ఇలాంటి “పద్దతులు” గుర్తుకు రాకపోవడం విశేషం.

టీమిండియా సాధిస్తున్న విజయాలను ఓర్వలేక ఇంగ్లాండ్ జట్టు కడుపుమంటతో రగిలిపోతుందన్న విషయం వారి మాటల ద్వారా స్పష్టమవుతోంది. అందులోనూ మైదానం లోపల, బయట కోహ్లి చూపిస్తున్న దూకుడు వారిని మరింతగా అవహేళనకు గురి చేస్తోందని చెప్పవచ్చు. అయినా ఎంత స్లో అండ్ స్పిన్ పిచ్ లైనా ఇంగ్లాండ్ జట్టులోనూ ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు కదా… అలాగే కోహ్లి మాదిరి రికార్డు స్థాయి పరుగులు చేసే రూట్ లు కూడా ఉన్నారు కదా! ఓటమిలో క్రీడాస్పూర్తిని ప్రదర్శించకుండా… ఇలాంటి ఆరోపణలు చేయడం కూడా ఇంగ్లాండ్ జట్టు ఇమేజ్ ను మరింతగా డ్యామేజ్ చేస్తుందన్న విషయం గమనించాలి.