india-vs-england-moeen-ali-takes-virat-kohli-wicketఅయిదు రోజుల పాటు పదిహేను సెషన్లు జరిగే టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఒక్క ఆటగాడిపై ఆధారపడితే ఎలా ఉంటుందో టీమిండియా చాటిచెప్తోంది. తొలి టెస్ట్ మ్యాచ్ ఫీట్ నే మరొకసారి రిపీట్ చేస్తూ చేధించాల్సిన లక్ష్యం ముందు బొక్కాబోర్లా పడింది. దీంతో మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను 3-1తేడాతో ఇంగ్లాండ్ వశం చేసుకుంది.

245 పరుగుల లక్ష్యంతో నాలుగవ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన టీమిండియా 22 పరుగులకే తొలి 3 వికెట్లు నేలకూలడంతో, భారమంతా విరాట్ కోహ్లిపై పడింది. ఈ సారి కోహ్లికి తోడుగా అజెంకా రేహానే అండగా నిలవడంతో, వీరిద్దరూ మరో 101 పరుగులు జోడించారు. 123 పరుగుల వద్ద మొయిన్ అలీ వేసిన స్పిన్ బంతికి విరాట్ కోహ్లి అవుట్ కావడంతో, టీమిండియా పతనం ఆరంభమైంది.

కోహ్లి ఉన్నంతవరకు విజయం టీమిండియా వైపు ఉండగా, ఆ తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా మలుపుతిరిగింది. దాని పర్యవసానం… 184 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయ్యింది. ఈ టెస్ట్ కోసమే రంగంలోకి దించిన ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ ని ఎదుర్కోవడంలో రెండు ఇన్నింగ్స్ లలోనూ టీమిండియా బ్యాట్స్ మెన్లు పూర్తిగా విఫలమయ్యారు.

సిరీస్ ఆద్యంతం ఒక్క విరాట్ కోహ్లి మినహా, మరే బ్యాట్స్ మెన్ కూడా రాణించకపోవడమే టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. తొలి ఇన్నింగ్స్ లో పుజారా సెంచరీతో రాణించినప్పటికీ, కోహ్లి ఔటైన కొద్దిసేపటికి వరుసగా 5 వికెట్లు పతనమయ్యాయి. ఇలా ఒక్క విరాట్ కోహ్లిని దృష్టిలో పెట్టుకుని టీమిండియా బరిలోకి దిగితే ఇలాంటి వైఫల్యాలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి.