india-vs-england-3rd-test-eight-wicket-win-against-england-2-0దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ టీమిండియాతో చేరిన ‘బుడ్డోడు’ పార్థీవ్ పటేల్ రెండవ ఇన్నింగ్స్ లో చేలరేగి ఆడాడు. కేవలం 104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా విజయాన్ని కేవలం 20.2 ఓవర్లలోనే ముగించేలా చేసాడు పార్థీవ్. 54 బంతులను ఎదుర్కొన్న పార్థీవ్ 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 67 పరుగులు చేయడంతో ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా మ్యాచ్ నాలుగవ రోజే ముగిసిపోయింది.

స్వల్ప లక్ష్యంలో రెండవ ఓవర్ లోనే మురళీ విజయ్ డకౌట్ గా వెనుదిరిగినప్పటికీ, వికెట్ల పతనాన్ని పుజారా (25) కాసేపు ఆపగలిగాడు. అయితే మరో ఎండ్ లో చిచ్చరపిడుగులా పటేల్ చెలరేగడంతో, పుజారా అవుట్ అయినప్పటికీ, కోహ్లి (6 నాటౌట్)తో మ్యాచ్ ను విజయవంతంగా ముగించాడు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 78/4 తో ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు, వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ టీమిండియాకు పోటీని ఇవ్వలేకపోయింది.

రూట్ 78, హమీద్ 59 నాటౌట్ మినహా మరే ఇతర బ్యాట్స్ మెన్లు తమ స్థాయికి తగిన విధంగా ప్రదర్శన ఇవ్వలేకపోయారు. బౌలింగ్ విభాగంలో షమీ 2 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు, జడేజా 2, జయంత్ యాదవ్ 2 వికెట్లతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ తరపున లోయర్ ఎండ్ లో 90 పరుగులు చేసి ఆధిక్యానికి కారణమైన రవీంద్ర జడేజా బౌలింగ్ లోనూ రాణించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.

ఈ విజయంతో 5 మ్యాచ్ ల సిరీస్ లో మూడు టెస్టులు ముగిసే సమయానికి టీమిండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో టీమిండియా ఈ సిరీస్ లో ఓటమి అనే దానికి అవకాశం లేదు. మిగిలిన రెండు టెస్టులను ఇంగ్లాండ్ కైవసం చేసుకుంటే తప్ప, సిరీస్ ను డ్రా చేసుకునే అవకాశం లేదు. ఏ ఒక్క టెస్టు మ్యాచ్ డ్రా అయినా టీమిండియాకు సిరీస్ దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న ఫాంను బట్టి, టీమిండియా ఖచ్చితంగా సిరీస్ ఎగురవేసుకుని పోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు