India vs England, 3rd Test at Nottinghamతొలి టెస్ట్ లో గెలుపును త్రుటిలో చేజార్చుకున్న టీమిండియా, రెండో టెస్ట్ లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. కీలకమైన మూడి టెస్ట్ లో మాత్రం తనదైన శైలిలో చెలరేగి ఆడుతూ స్థాయికి తగిన ప్రతిభను చాటుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్ జట్టును కేవలం 161 పరుగులకు ఆలౌట్ చేసి చావుదెబ్బ తీసింది.

ఇంగ్లాండ్ పతనంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 5 వికెట్లతో కీలక పాత్ర పోషించాడు. తను వేసిన మొదటి బంతికి వికెట్ సాధించిన హార్దిక్, కేవలం 6 ఓవర్లు మాత్రమే వేసి ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. 168 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా, రెండో రోజు ముగిసే సమయానికి 124 పరుగులు చేసి 2 వికెట్లను కోల్పోయింది.

మొత్తమ్మీద 292 పరుగుల లీడ్ లో ఉన్న టీమిండియా చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్నాయి. హీనపక్షంగా మరో 150 పరుగులు జోడించినా, ఇంగ్లాండ్ లక్ష్యం 450 చేరుకుంటుంది గనుక, టీమిండియా విజయం దాదాపుగా ఖరారైనట్లే. ఇంగ్లాండ్ ను వరుణుడు ఆదుకుంటే తప్ప ఈ మ్యాచ్ లో టీమిండియా విజయాన్ని బహుశా ఎవరూ అడ్డుకోకపోవచ్చు.