India vs England, 2nd Testమొదటి టెస్ట్ మ్యాచ్ లో విజయాన్ని సాధించే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న టీమిండియా, రెండవ టెస్ట్ మ్యాచ్ లో గెలవాలంటే మరో అద్భుతం జరగాల్సిందే… అనిపించే విధంగా టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మొదటి రోజున టీమిండియా 107 పరుగులకు ఆలౌట్ అయిన అదే పిచ్ పైన ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 357 పరుగులు చేసి కేవలం 6 వికెట్లు మాత్రమే కోల్పోయింది.

దీంతో ఇప్పటికే 250 పరుగుల లీడ్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. అలాగే క్రీజులో బౌలర్ క్రిస్ వోక్స్ సెంచరీ సాధించి 120 పరుగులతో ఉండగా, మరో బౌలర్ కరెన్ 22 పరుగులతో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టులోనూ టాప్ ఎండ్ విఫలం కాగా, కీపర్ బైర్ స్టౌ 93 పరుగులతో సత్తా చాటగా, లోయర్ ఎండ్ టీమిండియాకు ట్విస్ట్ ఇచ్చారు. దీంతో రెండవ రోజు ముగిసే సమయానికి పూర్తి ఆధిపత్యంలో ఇంగ్లాండ్ జట్టు నిలిచింది.

ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే ఆస్ట్రేలియాపై ‘ద్రావిడ్ – లక్ష్మణ్’లు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ లను టీమిండియా బ్యాట్స్ మెన్లు రిపీట్ చేయాలి. ప్రస్తుతం టీమిండియా బ్యాట్స్ మెన్ల ఫాంను చూస్తే ఇది అత్యాశే అవుతుంది. క్రికెట్ లో అద్భుతాలు జరుగుతున్నాయి గనుక, ఆశావహ దృక్పధంతో అభిమానులు ఎదురుచూడడం సహజమే. మరి లార్డ్స్ వేదికగా టీమిండియా సత్తా చూపుతారో లేదో ఈ ఆదివారం క్లారిటీ వచ్చేస్తుంది.