India-Vs-Bangladesh-Cricket-Seriesబంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి బంతికి చేరుకునే సమయానికి విజయానికి 5 పరుగులు చేయాల్సి ఉండగా, టీమిండియా కీపర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన షాట్ తో సిక్సర్ కొట్టి మ్యాచ్ ను టీమిండియా వశం చేసాడు. చివరి రెండు ఓవర్లలో టీమిండియా విజయం సాధించాలంటే 34 పరుగులు చేయాల్సి ఉండగా, అందులో 8 బంతులను ఎదుర్కొన్న దినేష్ కార్తీక్ 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి టీమిండియా విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

తాను ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్ గా మలిచిన కార్తీక్, రుబెల్ హుస్సేన్ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 22 పరుగులు సాధించాడు. ఇక చివరి ఓవర్లో 12 పరుగులు చేయాల్సి ఉండగా, మరో ఎండ్ లో ఉన్న విజయ్ శంకర్ అధ్వానపు బ్యాటింగ్ పుణ్యమా అంటూ చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉంది. టీమిండియాకు ఉన్న ఒకే ఒక్క హోప్ దినేష్ కార్తీక్. ఈ తరుణంలో మ్యాచ్ లో గెలవడానికి బంగ్లాదేశ్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా సంయమనంతో చివరి బంతిని సిక్సర్ గా మలిచి బంగ్లాకు షాక్ ఇచ్చాడు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా బౌలర్లలో చాహాల్ 3 వికెట్లతో రాణించాడు. బంగ్లా ఇన్నింగ్స్ లో షబ్బీర్ రెహమాన్ 50 బంతుల్లో 77 పరుగులు చేసి గౌరవప్రదమైన 166 పరుగుల స్కోర్ ను అందించాడు. లక్ష్యం పెద్దది కాకపోవడంతో బాధ్యతారాహిత్యపు షాట్లతో శిఖర్ ధావన్, రైనాల వికెట్లు కోల్పోయిన టీమిండియాను కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులతో ఆదుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి మ్యాచ్ టీమిండియాదేనని అభిమానులు భావించిన తరుణంలో వరుసగా వికెట్లు కోల్పోతూ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళింది.

ఈ తరుణంలో బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసిన టీమిండియా నిర్ణయాలు తగిన మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా విజయ్ శంకర్ ను ఆర్డర్ లో ముందుకు పంపి, మ్యాచ్ ను పూర్తిగా బంగ్లాదేశ్ వైపుకు తిప్పారు. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన విజయ్ శంకర్ కీలకమైన సమయంలో 19 బంతులను ఎదుర్కొని, 17 పరుగులు మాత్రమే చేసాడు. ముఖ్యంగా 18వ ఓవర్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి టీమిండియాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టివేసాడు. చివరికి విజయ్ శంకర్ ఔటైన తర్వాతే టీమిండియా విజయం ఖరారయ్యింది. దినేష్ కార్తీక్ ఇన్నింగ్స్ ను చూసి దేశమంతా గర్విస్తోంది.