India Vs Autrailia Test Match Latest Newsపూణే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా పేలవమైన ప్రదర్శనతో చెత్త రికార్డులు నమోదు చేసుకుంది. ఆసీస్ బ్యాట్స్ మెన్లపై ఎలాంటి కసరత్తులు చేయకుండా తొలుత బౌలింగ్ లో విఫలం కాగా, తర్వాత పేలవమైన బ్యాటింగ్ ప్రతిభతో అత్యల్ప స్కోరుకే పెవిలియన్ చేరింది. అనంతరం ఆసీస్ ఆటగాళ్లపై ఒక్క అశ్విన్ మినహా, మిగతా బౌలర్లు ఎవరూ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. దీనికి తోడు చెత్త ఫీల్డింగ్ తో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇచ్చిన మూడు క్యాచ్ లను నేలపాలు చేసారు.

23, 29, 37 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ఇచ్చిన తేలికపాటి క్యాచ్ లను ఒడిసిపట్టుకోవడంలో విఫలం కావడంతో, విజయవంతంగా అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 298 పరుగులకు చేరుకోగా, ఇంకా ఆసీస్ చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి, అలాగే మూడు రోజుల ఆట మిగిలి ఉంది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లతో రాణించగా, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. ఒక్క రెండో రోజు ఆటలో మొత్తం 15 వికెట్లు నేలకూలగా, 252 పరుగులు స్కోరు బోర్డుపై చేరాయి.

ఈ మ్యాచ్ లో మొత్తం ఐదు క్యాచ్ లు టీమిండియా నేలపాలు చేయగా, మరో పక్కన ఆసీస్ ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్ లతో మ్యాచ్ ను మలుపు తిప్పుకున్నారు. ఈ మ్యాచ్ లో భారత్ విజయం అనేది అత్యాశే అవుతుంది తప్ప, ఆచరణకు సాధ్యం కాదన్న విషయం మ్యాచ్ ను తిలకించిన వారికి ఇట్టే అర్ధమైపోతుంది. నాణ్యమైన బౌలర్లను ఎదుర్కొనే సత్తా ప్రస్తుత టీమిండియా బ్యాట్స్ మెన్లకు లేదని చాటిచెప్పినట్లుగా అవుతోంది. ఇక్కడ ఆస్ట్రేలియా జట్టును ఖచ్చితంగా అభినందించి తీరాలి. ప్రతి బ్యాట్స్ మెన్ కు ఒక పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేసి పెవిలియన్ పంపడంలో వారికి వారే సాటి అని నిరూపించుకున్నారు.