India Vs Australia Test Seriesరెండు టెస్టులు ముగిసే సమయానికి చెరొక టెస్ట్ విజయంతో సమానంగా ఉండడంతో, మూడవ టెస్ట్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్న దాని పైనే సిరీస్ విజేత నిర్ణయం అవుతుంది. దీంతో ప్రతిష్టాత్మకంగా మారిన ఈ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టులో రెండు కీలక మార్పులు చేసారు. గాయంతో తప్పుకున్న స్టార్క్ స్థానంలో కమ్మిన్స్ ను తీసుకోగా, ఫాంలో లేని మిచెల్ మార్ష్ స్థానంలో మాక్స్ వెల్ ను బరిలోకి దింపారు. అయితే మూడవ టెస్ట్ మ్యాచ్ లో వీరిద్దరి పాత్రలే కీలకం అవ్వడం చెప్పుకోదగ్గ విషయం.

టాస్ గెలిచి తొలి రోజు బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 140 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అప్పటికి క్రీజులో కెప్టెన్ స్మిత్ ఉన్నప్పటికీ, మరో ఎండ్ లో వికెట్లు పడుతున్నాయి. ఈ తరుణంలో బ్యాటింగ్ కు దిగిన మాక్స్ వెల్ ఏకంగా సెంచరీ బాది, ఆసీస్ భారీ స్కోర్ కు బాటలు వేసాడు. మాక్స్ వెల్ అండతో స్మిత్ బ్యాటింగ్ లో చెలరేగిపోయి, చివరి వరకు నాటౌట్ గా నిలిచాడు. మాక్స్ వెల్ – స్మిత్ జోడి అందించిన 191 పరుగుల భాగస్వామ్యమే ఆసీస్ 451 పరుగులకు కారణమైంది.

మాక్స్ వెల్ బ్యాటింగ్ లో అలా న్యాయం చేయగా, బౌలింగ్ లో కమ్మిన్స్ టీమిండియా కీలక వికెట్లను పడగొట్టి, మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించకుండా చూసాడు. ఈ సిరీస్ లో అద్భుతమైన ఫాంలో ఉన్న కేఎల్ రాహుల్ మరోసారి అలాంటి బ్యాటింగ్ నే చేస్తుండగా, అద్భుతమైన బంతితో రాహుల్ ను పెవిలియన్ కు పంపాడు కమ్మిన్స్. అలాగే గత రెండేళ్ళుగా సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్న విరాట్ కోహ్లిని, ఈ సిరీస్ లో భారత బ్యాటింగ్ కు వెన్నుమూకగా నిలిచిన రెహానేను కూడా కమ్మిన్స్ పెవిలియన్ కు చేర్చాడు.

అలాగే చివరి సెషన్లో ఎలాగైనా వికెట్ తీయాలన్న కాంక్షతో బౌలింగ్ చేసిన కమ్మిన్స్ కు అశ్విన్ దొరికిపోయాడు. ఇలా మూడవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 360 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోగా, అందులో 4 వికెట్లను కమ్మిన్స్ దక్కించుకుని, భారత బ్యాటింగ్ ను శాసించాడు. అయితే కమ్మిన్స్ తో పాటు మిగిలిన ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన పుజారా మరో సెంచరీ పూర్తి చేసుకుని క్రీజులో 130 పరుగులతో నాటౌట్ గా నిలువగా, మరో ఎండ్ లో కీపర్ సాహా 18 పరుగులతో ఉన్నాడు.

టీమిండియా బ్యాట్స్ మెన్లలో ఓపెనర్లు రాహుల్ 67, విజయ్ 82 పరుగులు చేసి అవుట్ కాగా, కోహ్లి 6, రెహానే 14, కరుణ్ నాయర్ 23. అశ్విన్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు. నాలుగవ రోజులో ఏ జట్టు అయితే ఆధిపత్యం ప్రదర్శిస్తుందో, ఖచ్చితంగా విజయం ఆ జట్టుదేనని చెప్పడంలో సందేహం లేదు. టీమిండియాకు విజయం దక్కాలంటే మాత్రం, ప్రస్తుతం ఉన్న స్కోర్ 500 మార్క్ చేరుకోవాల్సి ఉండగా, మరో పక్కన ఆసీస్ త్వరగా ఆలౌట్ చేసి, లీడ్ సంపాదించి టీమిండియాను భంగపరచాలని భావిస్తోంది. దీంతో ఆదివారం రాంచీలో జరగబోయే ఆట సిరీస్ విజేతను నిర్ణయించబోతోంది.