India VS Australia Test Seriesక్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ తర్వాత అంతటి శత్రువుగా భావించే ఆస్ట్రేలియాను టీమిండియా మట్టి కరిపించింది. సిరీస్ ప్రారంభానికి ముందు అనేక అనుమానాలు తలెత్తగా, వాటినన్నింటిని పటాపంచలు చేస్తూ దిగ్విజయంగా సిరీస్ ను సొంతం చేసుకుంది. మాంచి ఫాంలో ఉన్న టీమిండియాకు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే ఓటమి రుచి చూపించడంతో, సిరీస్ లో ఆస్ట్రేలియాదే పైచేయి అని భావించారు. కానీ, క్రిందకి ఒంగిన కెరటంలా ఉవ్వెత్తున ఎగసిపడి కంగారులను పరుగులు పెట్టించింది టీమిండియా.

క్రీడా స్ఫూర్తి అంటే ఏమిటో పెద్దగా అలవాటు లేని ఆస్ట్రేలియన్ జట్టు ప్రతిభ కేవలం మొదటి మ్యాచ్ వరకే పరిమితమైంది. ఆ తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్ లో బౌన్స్ బ్యాక్ అయిన టీమిండియా, ఇక వెనుతిరిగి చూసుకోలేదు. మూడవ మ్యాచ్ ను కూడా గెలిచినంత పని చేసినప్పటికీ, ఎంతో కొంత సమయస్పూర్తిని ప్రదర్శించిన ఆసీస్ బ్యాట్స్ మెన్లు డ్రాతో గట్టెక్కారు. ఇక సిరీస్ నిర్ణయంగా మారిన చివరి టెస్ట్ మ్యాచ్ లో దూకుడుగా వెళ్ళిన కంగారులకు చుక్కలు చూపించింది భారత జట్టు.

నిజమైన సమిష్టి కృషికి నిదర్శనం ఈ సిరీస్ గెలుపు అని చెప్పాలి. ఇంగ్లాండ్ పై కూడా భారత్ 4-0 తేడాతో విజయం సాధించింది. అయితే అది బ్యాటింగ్ లో కోహ్లి, బౌలింగ్ లో అశ్విన్, జడేజాల వరకే పరిమితమైంది. కానీ, ఈ సిరీస్ లో ఏ ఒక్కరిని పక్కన పెట్టడానికి ఆస్కారం లేకుండా టీమిండియా విజయం సాధించింది. ఒక రకంగా కెప్టెన్ విరాట్ కోహ్లినే తన వంతు బ్యాటింగ్ బాధ్యతలలో విఫలమయ్యాడని చెప్పాలి. కెప్టెన్ గా మార్కులు కొట్టేసినా, బ్యాట్స్ మెన్ గా కోహ్లి ఒక్క ఇన్నింగ్స్ లో కూడా తన స్థాయికి తగినట్లుగా రాణించలేకపోయారు.

బ్యాటింగ్ లో ఓపెనర్ రాహుల్ నుండి కీపర్ సాహా వరకు రాణించగా, బౌలింగ్ లో ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ నుండి కొత్త కుర్రాడు కులదీప్ వరకు కంగారులను బెంబేలెత్తించారు. ఈ సిరీస్ విజయంతో టెస్ట్ మ్యాచ్ లలో టీమిండియాకు ఎందుకు నెంబర్ 1 స్థానం దక్కిందో ప్రపంచానికి కూడా చాటి చెప్పింది. ఓటమి పాలు అయినప్పటికీ, భారత జట్టుకు గట్టి పోరాటపటిమను ప్రదర్శించడంలో ఆసీస్ సక్సెస్ సాధించింది. ఇంగ్లాండ్ పై దక్కినట్లుగా ‘నల్లేరు మీద నడక’లా విజయాలు సొంతం కాలేదు.

చివరి రోజు 87 పరుగులు చేయాల్సి ఉండడంతో ట్విస్ట్ లు ఏమైనా సంభవిస్తాయేమోనని క్రికెట్ ప్రేమికులు ఆందోళన చెందారు. అయితే అలాంటి వాటికి ఆస్కారం లేకుండా ఓపెనర్ రాహుల్ సక్సెస్ ఫుల్ గా జట్టును ఒడ్డుకు చేర్చాడు. ఒక దశలో 46 పరుగుల వద్ద ఒకే ఓవర్ లో రెండు వికెట్లు నేలకూలడంతో కాస్త కంగారు పడినప్పటికీ, ప్రస్తుత కెప్టెన్ రెహానే రాకతో అంతా తారుమారయ్యింది. ఆసీస్ కు మరో అవకాశం ఇవ్వకుండా సూపర్ ఫాంలో ఉన్న రాహుల్ తో కలిసి జట్టుకు అపూర్వ విజయాన్ని అందించి, భవిష్యత్తు కెప్టెన్సీ లక్షణాలు తనలో పుష్కలంగా ఉన్నాయని చాటిచెప్పుకున్నాడు.