India Vs Australia Test Seriesఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్ లలో ఫలితం తేలడం అన్నది సర్వసాధారణంగా మారిపోయింది. ఎక్కువ సార్లు అయితే నాలుగవ రోజుకే మ్యాచ్ లు ముగిసిపోతున్నాయి. ఇక టీమిండియా ఆడుతున్న మ్యాచ్ లలో అయితే ఖచ్చితంగా ఫలితం తేలేవిగానే మారిపోతున్నాయి. గత ఏడు సంవత్సరాలలో కేవలం అయిదంటే అయిదు మ్యాచ్ లు మాత్రమే డ్రా అయ్యాయి అంటే, ఏ రేంజ్ లో మ్యాచ్ లను ఆడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ ను డ్రాగా చేసుకోవడంలో ఆసీస్ సఫలమైంది. అయిదవ రోజు తీవ్ర ఒత్తిడితో బ్యాటింగ్ దిగిన ఆసీస్ వెంట వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోవడంతో 63 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో టీమిండియా జయకేతనం ఎగురవేస్తుందని భావించగా, ఆసీస్ పతనానికి, టీమిండియా విజయానికి అడ్డు గోడలా నిల్చున్నారు ఇద్దరు బ్యాట్స్ మెన్లు.

షాన్ మార్ష్, హ్యాండ్స్ కాంబ్ లు దాదాపుగా 63 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడంతో, గండం నుండి ఆసీస్ గట్టెక్కింది. లేదంటే టీమిండియా ఖాతాలో మరో విజయం పడేది. వీరిద్దరి భాగస్వామ్యాన్ని జడేజా విడదీసినా గానీ, అప్పటికే మ్యాచ్ ను డ్రా దిశగా మలిచేసారు. దీంతో మూడు మ్యాచ్ లు ముగిసే సమయానికి 1-1తో సిరీస్ సమంగా నిలువగా, గతేడాది ఇంగ్లాండ్ తో, 2015లో దక్షిణాఫ్రికాతో, 12లో ఇంగ్లాండ్ తో, 11లో వెస్టీండీస్ తో చివరగా టీమిండియా టెస్ట్ మ్యాచ్ లు డ్రా అయ్యాయి.