India-Vs-Australia-Test-Match-2017శత్రు దేశంగా భావించే పాకిస్తాన్ మీద గెలిచినా కూడా ఇంత సంతోషంగా ఉంటుందో లేదో గానీ, ఆస్ట్రేలియాపై గెలుపు మాత్రం ఎప్పుడు మధుర స్మృతులనే మిగులుస్తుంది. అందుకే ఈ జట్టుపై ఓటమి చవిచూసిన సమయంలో కూడా టీమిండియాపై విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి, రెండవ టెస్ట్ లో కేవలం 189 పరుగులకే ఆలౌట్ అయ్యి, మానసికంగా బాగా కృంగిపోయి ఉన్న టీమిండియా నాలుగవ రోజు జరిగిన అనూహ్య మలుపులతో విజయకేతనం ఎగురవేసింది.

కేవలం 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 35.4 ఓవర్లు ముగిసే సమయానికి 112 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోయింది. దీంతో తొలి మ్యాచ్ లో చవిచూసిన ఘోర ఓటమికి టీమిండియా రివేంజ్ తీర్చుకున్నట్లయ్యింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ బ్యాట్స్ మెన్లు టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ ఫాంలో ఉన్న రెంషాను వెనక్కి పంపి, ఆసీస్ పతనానికి నాంది వేసాడు.

ఓ పక్కన వికెట్లు పడుతున్నప్పటికీ ధాటికి బ్యాటింగ్ చేసిన వార్నర్ ను అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. ఎల్బీడబ్ల్యూగా వార్నర్ వెనుదిరగగా, ఆ తర్వాత స్మిత్, షాన్ మార్ష్ లను పంపించడంలో పిచ్ సహకరించింది. 74 పరుగుల వద్ద స్మిత్ అవుట్ కావడంతో విజయం మనదేని భావించిన టీమిండియా బౌలర్లకు హాండ్స్ కాంబ్, మిచెల్ మార్ష్ లు మళ్ళీ ఎదురుదాడి చేసారు. అయితే టీ విరామ సమయానికి ముందు మార్ష్ ను, కీపర్ వాడేను వెనక్కి పంపడంతో టీమిండియాలో విజయపు ఆశలు చిగురించాయి.

ఇక, టీ తర్వాత మిగిలిన మూడు వికెట్లను కూడా అశ్విన్ తన ఖాతాలో వేసుకుని మొత్తంగా 45 పరుగులిచ్చి 6 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఒక దశలో 101 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించిన కంగారులను 112 పరుగులకు ఆలౌట్ చేయడంలో పిచ్ పాత్ర కూడా ఉందని ఒప్పుకుతీరాలి. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆసీస్ కు అనుకూలించింది కూడా అదే పిచ్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. దీంతో 4 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో చెరో విజయంతో 1-1తో సమానంగా నిలిచాయి.

అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఎవరికీ దక్కుతుందా అన్న ఆసక్తి నెలకొంది. రెండు ఇన్నింగ్స్ లలో ఓపెనర్ రాహుల్ రాణించగా, పుజారా – రెహనేల భాగస్వామ్యం మ్యాచ్ ను టీమిండియా వైపుకు తిప్పిందనే చెప్పాలి. అలాగే తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరిచిన జడేజా ఉండగా, అదే స్థానంలో రెండవ ఇన్నింగ్స్ లో అశ్విన్ ఉన్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులతో, రెండవ ఇన్నింగ్స్ లో 51 పరుగులతో రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ కే అగ్ర తాంబూలం అందడంతో, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ రాహుల్ వశమైంది.