Rohit Sharma gets the Man of the Match award for his knock of 125 off 109 ballsప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమైన క్రికెటర్ ఎవరంటే… ముందుగా వినిపించే పేరు విరాట్ కోహ్లి. అవును… ప్రతి ఫార్మాట్ లోనూ అత్యుత్తమైన రికార్డులకు నిలయంగా నిలుస్తున్న కోహ్లి పేరు అందరికీ తెలుస్తోంది గానీ, సైలెంట్ గా పనికానిచ్చేస్తున్న రోహిత్ శర్మ పేరు పెద్దగా బహిర్గతం కాకపోవడం విశేషం. ఓపెనర్ గా అడుగుపెట్టిన నాటి నుండి రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తున్నారని చెప్పడానికి నిదర్శనమే తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్. చివరి మ్యాచ్ లో 125 పరుగులతో సూపర్ సెంచరీ సాధించిన రోహిత్, టీమిండియా విజయంలో కీలకభూమిక పోషించాడు.

అంతేకాదు… గత మూడు సిరీస్ లలోనూ ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా కూడా రోహిత్ తన పేరును మరోసారి నమోదు చేయించుకున్నాడు. 2013, 2016 సిరీస్ లతో పాటు తాజా సిరీస్ లోనూ టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసి, తన సత్తాను మరోసారి చాటిచెప్పాడు. అలాగే 2013 నుండి పరుగుల జాబితాను పరిశీలిస్తే… విరాట్ కోహ్లి కంటే ఒక మెట్టు రోహిత్ శర్మనే పైన ఉండడం అత్యంత ఆసక్తికరమైన అంశం. 108 ఇన్నింగ్స్ లలో కోహ్లి 4881 పరుగులు చేయగా, రోహిత్ 81 ఇన్నింగ్స్ లలోనే 4055 పరుగులు చేసాడు.

విరాట్ కోహ్లి కంటే 27 ఇన్నింగ్స్ లు తక్కువ ఆడిన రోహిత్ శర్మ కేవలం 826 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. రోహిత్ ఆ ఇన్నింగ్స్ లకు చేరుకునే సమయానికి ఖచ్చితంగా మరో 1000 పరుగులు పైనే జోడిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఒక బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ ఆడే షాట్లను చెప్పాలంటే… రవివర్మే రావాలేమో..! క్రికెట్ లో చాలామంది స్టైలిష్ ఆటగాళ్ళు వచ్చారు గానీ, రోహిత్ శర్మలా షాట్లు కొట్టడం మరొకరికి సాధ్యం కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రోహిత్ ఔటైనప్పుడు ఎంత లేజీగా ఉంటాడో, షాట్స్ కొట్టేటప్పుడు అంత చూడముచ్చటగా ఉంటుంది.