India vs Australiaచెన్నై వేదికగా ప్రారంభమైన ఇండియా – ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ లో మొదటి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, సగం ఓవర్లు ముగిసే సమయానికి మ్యాచ్ ను బ్యాట్స్ మెన్లు ముంచేశారు అని భావించిన తరుణంలో… క్రీజులో ఉన్న మహేంద్ర సింగ్ ధోని, హార్దిక్ పాండ్యలు మ్యాచ్ ను మలుపు తిప్పారు. ఒక దశలో 87 పరుగులకు 5 టాపార్డర్ వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్ ఉన్న టీమిండియాను, చివరికి 281 పరుగులకు చేర్చారు. ధోని 88 బంతుల్లో 79 పరుగులు చేయగా, పాండ్య 66 బంతుల్లో 83 పరుగులు చేసి సత్తా చాటాడు. చివర్లో భువనేశ్వర్ కూడా 32 పరుగులతో రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ ను నమోదు చేసింది.

ఆ తర్వాత మ్యాచ్ లో వరుణుడు ప్రత్యక్షం కావడంతో, ఆసీస్ లక్ష్యం 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్దేశించారు. అయితే వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని రీతిలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌల్ చేసారు. కట్టుదిట్టమైన బౌలింగ్ తో 35 పరుగులకే 4 వికెట్లు తీయగా, కాసేపు మాక్స్ వెల్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు గానీ ఫలితం లేకపోయింది. ఫైనల్ గా నిర్ణీత 21 ఓవర్లలో కేవలం 137 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. దీంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 26 పరుగులతో టీమిండియా జయకేతనం ఎగురవేసి, సిరీస్ లో 1-0 తేడాతో ముందంజలో ఉంది.

బ్యాటింగ్ లో 83 పరుగులు చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ కు కారణం అవ్వడమే కాకుండా, బౌలింగ్ లో స్మిత్, హెడ్ వికెట్లను తీసిన హార్దిక్ పాండ్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ తాజా విజయంతో కెప్టెన్ గా విరాట్ కోహ్లి ఖాతాలో 50 విజయాలు నమోదు చేసుకున్నాడు. 28 వన్డేలలో, 19 టెస్ట్ లలో, 3 టీ20లలో కలిపి హాఫ్ సెంచరీ విజయాలను చేరుకున్నాడు. చెన్నైలో ఇప్పటివరకు ఆసీస్ తో అయిదు వన్డేలను ఆడిన టీమిండియా, గెలవడం మాత్రం ఇదే తొలిసారి.