India Versus Pakitan T20 world cup 20116మామూలుగానే ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు జట్లకు తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. అది ప్రపంచ కప్ అయితే దానికుండే ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుంది గనుక… ఆ ఒత్తిడి ఇంకాస్త రెట్టింపవుతుంది. అయితే ఇప్పటికే ఆడిన ఒక మ్యాచ్ లోనూ ఓటమి పాలయ్యి… తప్పక గెలవాల్సిన పరిస్థితులలోకి టీమిండియా జట్టు ఉండడంతో ఈ మ్యాచ్ లో ఎలా రానిస్తుందో అన్న ఆసక్తి క్రీడావర్గాల్లో వ్యక్తమవుతోంది.

నిజానికి ఇండియా – పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంటుంది. అదే భారత్ కు ప్లస్ పాయింట్ గా మారి విజయాన్ని సులభతరం చేస్తుంది. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ లో ఉంది. మరి పాక్ పై భారత్ గెలుపు సాధిస్తుందా? మొదటి మ్యాచ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడి ఓటమి పాలైన టీమిండియా గుణపాఠాలు నేర్చుకున్తుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నీ సగటు క్రికెట్ అభిమాని మదిలో మెదులుతున్నాయి.

కానీ, ఈ ప్రపంచ కప్ గెలవకపోయినా సహిస్తారేమో గానీ, పాక్ తో మ్యాచ్ ఓటమి పాలయితే మాత్రం భారత అభిమానులు జీర్ణించుకోలేరన్న విషయం మైదానంలో అడుగుపెడుతున్న ప్రతి క్రీడాకారుడికి తెలిసిన విషయమే. పాకిస్తాన్ అభిమానుల పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. అయితే ఈ మ్యాచ్ లో గెలవడం పాక్ కంటే కూడా భారత జట్టుకే ముఖ్యం. ఈ మ్యాచ్ లో ఓటమి పాలయితే దాదాపుగా టీమిండియా సిరీస్ నుండి అవుట్ అయినట్లే భావించవచ్చు.