india surgical strike 2 on pakistanనియంత్రణ రేఖను దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం ఈరోజు తెల్లవారు జామున మెరుపు దాడి చేసింది. గతంలో జరిగిన మెరుపు దాడి సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు. ఈ సారి మాత్రం పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి దాడి చేశారు. జైషే మహ్మద్‌కు చెందిన అతిపెద్ద ఉగ్ర శిబిరమైన బాలకోట్‌లో దాడి చేసారు. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్‌ కమాండర్‌లు, జిహాదీలను మట్టుబెట్టారు.

ఈ ఉగ్రశిబిరం జైషే అధినేత మసూద్‌ అజార్‌ బంధువైన మౌలానా యూసఫ్‌ అజార్‌ అలియాస్‌ ఉస్తాద్‌ ఆధ్వర్యంలో నడుస్తోంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ శిబిరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. దాదాపుగా 300కు పైగా చనిపోయి ఉంటారని అంచనా. దాయాదిపై దాడి సందర్భంగా కూడా భారత్ తన ఔదార్యాన్ని చూపించింది. పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు నిర్దేశిత లక్ష్యాలపైనే దాడి చేసింది. కేవలం ఉగ్రవాదులు మాత్రమే ఉండే ప్రదేశాన్ని దాడికి ఎన్నుకుంది.

గతంలో జరిపిన మెరుపు దాడి లో కూడా సామాన్యులు ఎవరూ హతం కాకుండా చర్యలు చేపట్టింది. మరోవైపు దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో గుజరాత్‌లోని కచ్‌ అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న నలియా ఎయిర్‌ బేస్‌ సమీపంలో గుర్తించిన దీన్ని అక్కడి సిబ్బంది వెంటనే పేల్చివేశారు. ఈ ఎయిర్‌ బేస్ సరిహద్దు అతి సమీపంలో ఉంటుంది. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి రాష్టాలలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది భారత ప్రభుత్వం.