india-newzealand-cricket-first-man-of-the-matchఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రారంభమైన వన్డే సిరీస్ ను కూడా టీమిండియా ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా, ప్రత్యర్ధి కివీస్ జట్టును కేవలం 190 పరుగులకే ఆలౌట్ చేయడంలో సక్సెస్ సాధించింది. ఒకానొక సమయంలో 100 పరుగులు కూడా చేస్తుందా? లేదా అనుకున్న కివీస్ జట్టును ఓపెనర్ లథం, బౌలర్ సౌతీలు ఆదుకున్నారు. సౌతీ 45 బంతుల్లో 55 పరుగులు చేయగా, ఓపెనర్ లథం 79 పరుగులతో అజేయంగా నిలిచారు. వీరిద్దరి 71 పరుగుల భాగస్వామ్యం కారణంగానే కివీస్ ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది.

టీమిండియా బౌలర్లలో ముఖ్యంగా ఓపెనింగ్ బౌలింగ్ కు దిగిన హార్దిక్ పాండ్యే కీలకమైన 3 వికెట్లు తీసి మ్యాచ్ ను ఆదిలోనే భారత్ వైపుకు తిప్పాడు. గుప్తిల్, ఆండర్సన్, రాంకీ వికెట్లను పడగొట్టిన పాండ్యే, 7 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు అందుకుని, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆడిన తొలి వన్డేలోనే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును హార్దిక్ పాండ్యే సొంతం చేసుకోవడం విశేషం. ఇక, లక్ష్య చేధనలో ఎలాంటి తడబాటులకు, ట్విస్ట్ లకు తావు లేకుండా కేవలం 33.1 ఓవర్లలోనే అందుకుంది.

రోహిత్ శర్మ 14 పరుగులకే ఔటైనప్పటికీ, రేహానే 33 పరుగులతో రాణించగా, మనీష్ పాండే 17, మహేంద్ర సింగ్ ధోని 21 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. మరో ఎండ్ లో విరాట్ కోహ్లి మాత్రం 81 బంతుల్లో 1 సిక్సర్, 9 ఫోర్లతో 85 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లితో పాటు జాదవ్ 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టెస్ట్ సిరీస్ ను 3-0తో కోల్పోయిన కివీస్ జట్టు, వన్డేలలో అయినా పోరాటపటిమను ప్రదర్శిస్తుందని ఆశిస్తే… అది కూడా విఫలం కావడం విశేషం.