India-lost-in-Semi-finals-CWC-2019-Vs-NZఇంగ్లాండ్ లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్‌లో భారత్‌ కథ ముగిసింది. 18 పరుగుల తేడాతో టీమిండియాపై కివీస్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో మినహాయిస్తే వరుస విజయాలతో జైత్రయాత్ర సాగించిన కోహ్లీసేన ప్రయాణం సెమీస్‌తో నిలిచిపోవడం గమనార్హం. 240 పరుగుల టార్గెట్ వేటలో టీమిండియా టాప్‌ఆర్డర్‌ 5 పరుగులకే కుప్పకూలింది. ఆదుకున్నట్లే కనిపించిన పంత్‌(32), పాండ్య(32) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరుకున్నారు.

అయినా పూర్తిగా ఆశల్లేని మ్యాచ్‌లో టీమిండియా గొప్ప పోరాటం చేసింది. రవీంద్ర జడేజా (77; 59బంతుల్లో ), ధోనీ(50; 70బంతుల్లో ) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను దాదాపు గెలిపించే ప్రయత్నం చేశారు. అయితే పెద్ద షాట్ కు ప్రయత్నించి జడేజా, స్ట్రైక్ తీసుకోవడానికి లేని రన్ కోసం ప్రయత్నించి ధోని కీలక సమయంలో ఔట్‌ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. భారత్‌ 49.3 ఓవర్లలో 221 పరుగులకే పరిమితమైంది. ఈ ఓటమితో భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

అదే సమయంలో న్యూజిలాండ్‌ వరుసగా రెండు వరల్డ్ కప్స్ లో ఫైనల్ కు చేరింది. రేపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ లో గెలిచే టీం 18న న్యూజిలాండ్‌ తో ఫైనల్ ఆడుతుంది. న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ లలో ఏదైనా టీం గెలిస్తే వారు మొదటి సారి కప్పు సాధించినట్టే. ఆస్ట్రేలియా ఇప్పటికే ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచింది. మరోవైపు ఈ మ్యాచ్ తో మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి నిష్క్రమించినట్టేనా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.