india in top 15th place in pollution‘మేకిన్ ఇండియా’ కోసం ప్రపంచమంతా మనవైపు చూడాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ పరిశుభ్రమైన స్వచ్ఛభారత్ కోసం తపిస్తోంది. అయితే, కాలుష్య కాసారాలుగా మారిపోతున్న మన నగరాలు భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేసున్నాయని పలు నివేదిలకు హెచ్చరిస్తున్నాయి. జల, వాయు, వాహన కాలుష్యాలతో నగరాలు అల్లాడుతున్నాయి. ప్రపంచంలోని టాప్-20 పొల్యూటెడ్ నగరాల జాబితాలో… ఇండియాలోనే 13 సిటీలున్నాయని ఓ సర్వేలో తేలింది. సుమారు 66 కోట్ల మంది భారతీయుల జీవితకాలం… ఈ కాలుష్యాల కారణంగా మూడు నుంచి రెండేళ్ల వరకు తగ్గిపోతుందని ఓ విశ్లేషణ.

ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, నాసిక్, అమృత్‌సర్, హైదరాబాద్… ఇలా ఇంచుమించు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు వివిధ రకాల పొల్యూషన్‌తో మగ్గిపోతూ ఆందోళనను కలిగిస్తున్నాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కార్బన్ కాలుష్యాలు వెదజల్లే దేశాల్లో ప్రపంచలోనే చైనా ఫస్ట్ ప్లేస్‌లో వుండగా, ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. వీటితో పాటు ప్రజల నీటి అవసరాలను తీర్చే గంగా, యమున, గోదావరి నదులతో సహా దేశంలోని ప్రధాన నదులన్నీ కలుషితం బారిన పడుతున్నాయని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ తన నివేదికలో తెలిపింది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దేశంలోనే 290 నదుల జలాన్ని మూడేళ్ల పాటు విశ్లేషించినప్పుడు వీటి నీటిలో సుమారు 66 శాతం ఆర్గానిక్ కాలుష్యాలున్నట్లు తెలిసి షాక్ అయ్యింది. 8,400 కి.మీ. పొడవునా నదులు పొల్యూషన్‌తో నిండిపోయాయని, ఈ నీరు తాగడానికి గానీ, పంటలకు గానీ పనికిరాదని ఈ బోర్డు స్పష్టం చేసింది. వాతావరణంలో కాలుష్య విష వాయువులు పెరిగిపోవడం భారతీయుల మనుగడకు డేంజర్‌గా పరిణమిస్తోందని, మనం ఇప్పుడే మేల్కొనకపోతే మరిన్ని అనర్థాలు జరుగుతాయని ఈ సంస్థ తన రిపోర్టులో హెచ్చరించింది.

ఫ్యాక్టరీల నుంచి వెలువడే హానికరమైన రసాయన వ్యర్థాలు నీటిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. ఈ నీటిని తాగిన మనుషులు, పశువులు వ్యాధుల బారిన పడుతున్నారని పేర్కొంది. కేవలం కార్ల నుంచి వెలువడే కాలుష్యం వల్ల ఢిల్లీ, చండీఘర్, పనాజీ, చెన్నై సహా 10 నగరాల్లో ప్రజలు జబ్బుల బారినపడుతున్నారని తేలింది. ఈ పొల్యూషన్లను తగ్గించేందుకు చైనా రాజధాని బీజింగ్‌ అనుసరిస్తున్న విధానాన్ని మనం కూడా పాటించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచిస్తోంది. అక్కడ మొట్టమొదటిసారిగా రెడ్ అలర్ట్ ప్రకటన జారీ చేసిన కాలుష్య నియంత్రణ బోర్డు దశల వారీగా పొల్యూషన్‌కు స్పెషల్‌గా చర్యలు చేపడుతోంది. మనం కూడా వాటిని అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనా తర్వాత జనాభాలో సెకండ్ ప్లేస్‌లోవున్న ఇండియా ఇలా కాలుష్య కాసారంలో మగ్గుతోంది.