India first lithium ion battery factory in tirupati  Andhra Pradeshఆంధ్రప్రదేశ్‌కు మనోత్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోనే తొలి లిథియం అయాన్ సెల్ (బ్యాటరీ) ప్రాజెక్టును తిరుపతిలో ప్రారంభించనున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. 799 కోట్ల పెట్టుబడితో మూడు విడతల్లో కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ఈ ఒక్కటి ఏర్పాటైతే మొబైల్ విడిభాగాల పరిశ్రమలు మరిన్ని ఏపీకి వచ్చే అవకాశం ఉంది.

మొదటి విడతలో 165 కోట్ల పెట్టుబడి పెట్టనున్న మనోత్ ఇండస్ట్రీస్ 2 లక్షల ఏహెచ్ (ఆంపియర్ అవర్) నిల్వ సామర్థ్యం కలిగిన లిథియమ్ అయాన్ బ్యాటరీలను ఉత్పత్తి చేయనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఇది అందుబాటులోకి రానుంది. మొబైల్ తయారీ పరిశ్రమలకు లిథియమ్ అయాన్ బ్యాటరీలు ప్రాణం లాంటివి.

దేశంలోని 120 మొబైల్ తయారీ కంపెనీలు ఉండగా, అందులో 20 మినహా మిగతావన్నీ విదేశాల నుంచే బ్యాటరీలను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇప్పుడు తిరుపతిలోని ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే విదేశీ దిగుమతులు తగ్గే అవకాశం ఉంది. కంపెనీ పూర్తి సామర్థ్యం రోజుకు పది లక్షల ఏహెచ్‌లు కాగా, ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 1700 మందికి, పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.