sourav-gangulyఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్ర స్థానంలో ఉన్న పాకిస్తాన్ జట్టును వెనక్కి నెట్టి, ఇండియా నెంబర్ 1గా అవతరించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై వెస్ట్ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, క్రికెట్ లెజెండ్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేసారు. న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గంగూలీ, పాకిస్థాన్ జట్టు కంటే టీమిండియా చాలా ఉత్తమమైనదని పేర్కొన్నారు.

ఈ రెండు జట్ల మధ్య పోలికకు అవకాశమే లేదని, టెస్ట్ క్రికెట్‌ లో కోహ్లీ సేన పాక్ కంటే చాలా ముందుందని అభిప్రాయపడ్డాడు దాదా. అయితే, అసలు పాకిస్థాన్ నెంబర్ వన్ ర్యాంక్‌ కు చేరుకోవడమే ఆశ్చర్యానికి గురి చేసే అంశమని అవహేళన వ్యాఖ్యలు చేసిన గంగూలీ, టీమిండియా టాప్ ర్యాంక్ కు చేరుకోవడం గురించి తాను ఆలోచించలేదని అన్నారు. రెండో టెస్ట్‌ లో భారత్ గెలవడం తన లాంటి వారికి చాలా ఆనందం కలిగించిందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే… ఈ స్థానంలో మరికొంత కాలం టీమిండియా కొనసాగాలంటే, మూడో టెస్టులో కూడా భారత్ తప్పకుండా నెగ్గాలని గణాంకాలు చెబుతున్నాయి. రెండు టెస్టులు నెగ్గిన భారత జట్టు ఖాతాలో ప్రస్తుతం 111 పాయింట్లు ఉన్నాయి. సరిగ్గా అవే పాయింట్లు పాకిస్థాన్ వద్ద కూడా ఉన్నాయి. మూడోది గెలిస్తే టీమిండియా 115 పాయింట్లు, డ్రా అయితే 113 పాయింట్లు, ఓడిపోతే కనుక 111 పాయింట్లుగా వుంటాయి.

దీంతో పాకిస్థాన్ డెసిమల్ ఫ్రాక్షన్ పాయింట్లతో ముందుండి, మళ్లీ అగ్రస్థానానికి చేరే ప్రమాదం ఉంది. డ్రా అయితే విండీస్ తో టెస్టు సిరీస్ ఉండడంతో పాక్ మళ్లీ అగ్రస్థానం సాధించే అవకాశం పొంచి ఉంది. అయితే పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళకుండా ఉండాలంటే… టీమిండియా మూడవ టెస్ట్ మ్యాచ్ లోనూ విజయం తప్పనిసరి. అదే జరిగితే… భారత్ అగ్రస్థానానికి ఇప్పట్లో ఎలాంటి ప్రమాదం లేనట్లే..!