india-england-test-series-follow-onవిశాఖ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ పట్టుబిగించినట్లుగా కనపడుతోంది. ఓవర్ నైట్ స్కోర్ 317/4 పరుగులతో ఆరంభించిన టీమిండియా, కేవలం 455 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఒకానొక దశలో 400 కూడా చేరుకుంటుందో లేదో అనుకున్న జట్టును అశ్విన్ (58) అర్ధ సెంచరీతో ఆదుకోగా, జయంత్ యాదవ్ (35) పరుగులతో రాణించి పటిష్టమైన స్కోర్ ను అందివ్వగలిగారు. డబుల్ సెంచరీ సాధిస్తాడనుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లి 167 పరుగులకే ఔటయ్యాడు.

ఇక, తన తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టుకు మూడవ ఓవర్ నుండే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఫాంలో ఉన్న కెప్టెన్ కుక్ 2 పరుగులకే వెనుదిరగగా, మరో ఓపెనర్ హమీద్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అద్భుతమైన ఫాంలో రూట్ మాత్రం భారత బౌలర్లను ప్రతిఘటిస్తూ 53 పరుగులు చేసి అవుట్ కాగా, డకేట్ 5, అలీ 1 పరుగు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో 80 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును మరో వికెట్ కోల్పోకుండా స్టోక్స్, బైర్ స్టో ఆదుకున్నారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 103 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది.

ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కాలంటే… మరో 153 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. క్రీజులో ఉన్న ఇద్దరూ కొంతసేపు ఆడగలిగితేనే ఇంగ్లాండ్ ఫాలో ఆన్ గండం నుండి గట్టెక్కే అవకాశాలు కనపడడం లేదు. మరో వైపు భారత బౌలర్లు వీలైనంత త్వరగా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లను పెవిలియన్ పంపి, మరోసారి బ్యాటింగ్ ను దిగి భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచాలని భావిస్తోంది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లకు కాస్త కష్టతరమేనని చెప్పకతప్పదు.