India England First Test Kohli Captianఇండియా – ఇంగ్లాండ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్ట్ ఎంత బోర్ గా సాగాలో అంత బోరుగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ముగ్గురు సెంచరీలతో ఇంగ్లాండ్ జట్టు 537 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేయగా, భారత్ కూడా అదే బాటలో పయనిస్తోంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది టీమిండియా. గంభీర్ (29) పరుగులకే అవుట్ కాగా, పుజారా (124), విజయ్ (126)లు సెంచరీలతో చెలరేగడంతో, ఫాలో ఆన్ అనే మాట తలత్తే అవకాశమే ఇవ్వలేదు.

అయితే ఈ మ్యాచ్ ను వీక్షించడానికి క్రీడాభిమానులు మాత్రం ఆసక్తి కనపరచడం లేదు. ఓ పక్కన దేశాన్ని నోట్ల రద్దు విషయం కుదిపేస్తుండగా, ఈ మ్యాచ్ గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దానికి తోడు ఏ మాత్రం కిక్ లేకుండా సాగుతున్న టెస్ట్ మ్యాచ్, క్రికెట్ పట్ల ఆసక్తిని తగ్గించింది. దీనికి కారణం రాజ్ కోట్ లో పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలమైన పిచ్ ను తయారు చేయడమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. బ్యాట్ కు – బాల్ కు మధ్య అస్సలు పోటీ లేక బ్యాట్స్ మెన్లు సెంచరీలు బాదుతున్నారు.

బహుశా నాలుగవ రోజు ఏమైనా టీమిండియా వడివడిగా వికెట్లు పారేసుకుని, ఇంగ్లాండ్ వికెట్లు కూడా నేలకూలిస్తే తప్ప మ్యాచ్ లో ఫలితం వచ్చే అవకాశం లేదు. చాలా కాలం తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా పయనించడం విశేషం. కోహ్లి నాయకత్వంలో వరుసగా గెలుపొందుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనుకున్న టీమిండియా టెస్ట్ విజయాలకు, ‘డ్రా’ ద్వారా ఇంగ్లాండ్ బ్రేక్ వేస్తుందేమోనని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే క్రికెట్ లో చివరి వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుందన్న సంకేతాలను విజయ్, మిశ్రాల వికెట్లు చెప్తున్నాయి.