india-england-5th-test-series-highlightsఅయిదు టెస్ట్ సిరీస్ లలో భాగంగా ముంబైలోని ప్రారంభమైన నాలుగవ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇరు జట్లు సంతృప్తికరమైన రీతిలో ఉన్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు తొలి వికెట్ కు 99 పరుగుల పటిష్టమైన పునాది వేసింది. ఓపెనర్ కుక్ 46 పరుగుల వద్ద అవుట్ కాగా, రూట్ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ అర్ధ సెంచరీ (50) సాధించి, దూకుడు మీదున్న దశలో అవుట్ కావడంతో వికెట్ల పతనం ప్రారంభమైంది.

అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న మరో ఓపెనర్ జెన్నింగ్స్, తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ సాధించి ఇంగ్లాండ్ జట్టుకు వెన్నుమూకగా నిలిచాడు. చూడచక్కని షాట్లతో అలరిస్తూ 219 బంతుల్లో 13 ఫోర్లు కొట్టి 112 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. నిజానికి 230 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి పటిష్ట దశలో ఉన్న ఇంగ్లాండ్ జట్టును స్పిన్నర్ అశ్విన్ దెబ్బ తీసి, క్రీడాకారుల్లో, వీక్షకులలో మంచి ఉత్సాహం నింపాడు.

ఒకే ఓవర్ లో అలీ, జెన్నింగ్స్ లను వెనక్కి పంపడంతో డిఫెన్సులో పడ్డ ఇంగ్లాండ్ ను మరికొద్దిసేపట్లోనే ఫాంలో ఉన్న బైర్ స్టోను కూడా అవుట్ చేసి టీమిండియాకు కొత్త ఊపిరిని అందించాడు. అయితే 249 పరుగుల వద్ద 5 వికెట్ ను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు, ఆట ముగిసే సమయానికి మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. మొత్తంగా ఈ రోజు ఆటలో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న జెన్నింగ్స్ సూపర్ సెంచరీ చేయగా, ఇంగ్లాండ్ జట్టు కోల్పోయిన 5 వికెట్లలో నాలుగింటిని అశ్విన్ సొంతం చేసుకున్నాడు.

అయితే ఈ మ్యాచ్ లో రెండు అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఆటగాళ్ళు రిటైర్డ్ హర్ట్ అయ్యి పెవిలియన్ చేరుకుంటుంటారు. కానీ, ఈ మ్యాచ్ లో ఎంపైర్ పెవిలియన్ చేరుకోవడం చెప్పుకోదగ్గ విషయం. బౌండరీ లైన్ వద్ద నుండి భువనేశ్వర్ కుమార్ వేసిన త్రో సరిగ్గా ఎంపైర్ తలకు తగలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అలాగే భారత బౌలింగ్ విభాగం త్వరత్వరగా ఓవర్లు వేయడంతో 90 ఓవర్లకు బదులు 94 ఓవర్ల పాటు మ్యాచ్ సాగింది.